ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా విస్తరిస్తోన్న తరుణంలో విద్యార్థులకు తరగతులు నిర్వహించడం సరికాదని, విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. ఏపీలో థర్డ్ వేవ్ ఉద్ధృతమవుతున్న కారణంగా విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు పాఠశాలలకు సెలవులు పొడిగించాయని తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని లోకేశ్ డిమాండ్ చేశారు.


Also Read: సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. 4వారాల సమయం కావాలని లేఖ !






ప్రాణాలతో చెలగాటమాడొద్దు


'15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉన్న కారణంగా విద్యార్థులు,  తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాలతో చెలగాటమాడోద్దు. గత పది రోజుల్లో ఏపీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గత పది రోజుల్లోనే రోజుకి 500 కేసుల నుంచి 5 వేల కేసులు నమోదు అయ్యే పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో పాఠశాలల పునఃప్రారంభం పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంది. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. తల్లిదండ్రులను మరింత మానసిక ఆందోళనకు గురిచేయకుండా ప్రభుత్వం తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించాలి. తక్షణమే స్కూల్స్ కి సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.' ---నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి






లోకేశ్ కు కరోనా పాజిటివ్


నారా లోకేశ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని లోకేశ్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఇటీవల తనతో కాంటాక్ట్ అయిన వాళ్లందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ఆయన క్వారంటైన్ కు వెళ్లినట్లు ప్రకటించారు. 


Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి