సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఇప్పటికే చాలా మంది తారలు ఓపెన్ గా మాట్లాడారు. కొందరు దర్శకనిర్మాతలు, హీరోలు తమ కోరికలు తీరిస్తేనే అవకాశాలు ఇస్తామంటూ వేధించిన విషయాలను నటీమణులు బయటపెట్టారు. తెలుగులోనే కాకుండా.. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీలలో కూడా క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. 'మీటూ' అంటూ సోషల్ మీడియాలో ఓ ఉద్యమం కూడా నడిచింది. తాజాగా మరో నటి అప్సర రాణి తనకు ఎదురైన చేదు అనుభవాలను వివరించింది.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలతో నటిగా గుర్తింపు తెచ్చుకుంది అప్సర రాణి. ఈమెను బాగా ప్రమోట్ చేశారు వర్మ. తనతో పాటు పార్టీలకు వెంటబెట్టుకొని వెళ్తూ.. ఆమె ఫేమస్ అయ్యేలా చేశారు. ఈ క్రమంలోనే ఆమెకి 'క్రాక్' సినిమాలో ఐటెం సాంగ్ లో నటించే ఛాన్స్ వచ్చింది. సినిమాతో పాటు అప్సర రాణి స్పెషల్ సాంగ్ కి కూడా మంచి అప్రిసియేషన్ వచ్చింది.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అప్సర తన కెరీర్ లో ఎదుర్కొన్న కొన్ని చేదు సంఘటనలను వివరించింది. కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఓ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక చేశారని చెప్పిన అప్సర.. సినిమా డిస్కషన్స్ కోసం దర్శకుడు రూమ్ కి ఒంటరిగా రమ్మని పిలిచాడని.. తన కోరిక తీరిస్తేనే అవకాశం ఇస్తానని చెప్పిన విషయాన్ని వెల్లడించింది అప్సర రాణి. అయితే తాను మాత్రం అక్కడకి తండ్రిని వెంటబెట్టుకొని వెళ్లానని.. పరిస్థితి అర్ధమై సదరు దర్శకుడు వెంటనే అక్కడనుంచి పారిపోయాడని చెప్పింది. ఆ డైరెక్టర్ పేరుని మాత్రం బయటపెట్టలేదు అప్సర.
తెలుగులో మాత్రం తనకు అలాంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని చెప్పింది. టాలెంట్ ఉన్న వాళ్లకు తెలుగులో మంచి అవకాశాలే వస్తాయని.. ఒక సినిమా ఆడితే చాలు తెలుగు ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని చెప్పింది. ప్రస్తుతం ఈ బ్యూటీ హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.