దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 74 ఏళ్ల తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో అంతిమసంస్కారాలకు శ్మశానవాటికలు లేక ఇబ్బందులు ఎదుర్కోవడం దురదృష్టకరమని ఏపీ హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం జీవించే హక్కులో భాగంగానే మనిషి మరణించాక కూడా గౌరవమర్యాదలు, హుందాతనం ఉంటాయని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పినట్లు హైకోర్టు గుర్తుచేసింది. ఏపీ ప్రభుత్వం, స్థానికసంస్థలు ఈ అంశంలోని తీవ్రతను గుర్తించి కులమత, ప్రాంత విభేదాలతో సంబంధం లేకుండా ప్రజలందరికీ అవసరమైన శ్మశానవాటికలు ఏర్పాటుచేయాలని సూచించింది.
శ్మశానవాటిక ఆక్రమణలపై చర్యలు
ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని తీర్పు ప్రతిని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపాలని హైకోర్టు ఆదేశించింది. శ్మశానవాటికలు లేక ఎస్సీలు పెదకాకానిలో చెరువుగట్టుపై అంతిమ సంస్కారాలు చేయడంపై ఆ ఊరి వాళ్లు అభ్యంతరం తెలపడం తమ దృష్టికి వచ్చిందని కోర్టు పేర్కొంది. గుంటూరు జిల్లా పెదకాకానిలో శ్మశానవాటికకు చెందిన స్థలంలో సర్వే చేయాలని అధికారులను ఆదేశించింది. శ్మశానవాటిక స్థలం ఆక్రమణకు గురైతే బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఆ స్థలాన్ని ఎస్సీ సామాజికవర్గ ప్రజల శ్మశానం కోసం కేటాయించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. నాలుగు వారాల్లో సర్వే చేయాలని అధికారులకు కోర్టు తేల్చిచెప్పింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ శుక్రవారం ఈ కీలక తీర్పు ఇచ్చారు.
Also Read: Suresh Gopi: నన్ను ‘ఆవు పేడ’ అని అంటున్నందుకు గర్వంగా ఉంది.. నటుడు, ఎంపీ స్ట్రాంగ్ కౌంటర్
సొంతభూమితో కలిపి సాగు
గుంటూరు జిల్లా పెదకాకాని సర్వే నంబరు 153లోని హిందూ శ్మశానవాటిక భూమిలో కొంత స్థలాన్ని ఎస్సీల శ్మశానవాటికకు కేటాయించేందుకు అధికారులు ప్రతిపాదించారు. దీన్ని జి.రత్తయ్య, మరో 8 మంది హైకోర్టులో సవాల్ చేశారు. సర్వేనంబరు 153లో 95 సెంట్ల శ్మశానస్థలం ఉండగా 71 సెంట్లు అందుబాటులో ఉందని పిటిషినర్లు కోర్టుకు తెలిపారు. కాలువ, గట్లకు స్థలం పోగా మిగిలినదాంట్లో ప్రహరీ కట్టినట్లు తెలిపారు. క్రైస్తవ శ్మశానవాటిక కోసం 153 సర్వే నంబరులోని స్థలాన్ని కేటాయిస్తే తమ పొలాలకు వెళ్లేందుకు మార్గం ఉండదని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంపై పెదకాకాని తహశీల్దార్ కౌంటర్ దాఖలుచేశారు. రెవెన్యూ రికార్డు ప్రకారం సర్వేనంబరు 153లో 95 సెంట్లు ప్రభుత్వ పోరంబోకు స్థలమని తెలిపారు. అందులోని 71 సెంట్లలో హిందూ శ్మశానవాటిక ఉందన్నారు. ఆ స్థలానికి ప్రహరీ గోడ నిర్మించినట్లు తెలిపారు. మిగిలిన 24 సెంట్ల శ్మశానం భూమిని రత్తయ్య అనే రైతు ఆక్రమించారన్నారని తెలిపారు. పక్కనున్న సొంతభూమితో కలిపి ఈ స్థలంలో సాగు చేస్తున్నట్లు పేర్కొ్న్నారు.
Also Read: Huzurabad News: హుజూరాబాద్‌లో ఏం నడుస్తుంది? ఇంఛార్జిలతో కేసీఆర్ రివ్యూ, కీలక సూచనలిచ్చిన సీఎం
ఆ ప్రతిపాదన చట్టవిరుద్ధం కాదు
ఎస్సీ సామాజికవర్గానికి శ్మశానం కోసం ఆ 24 సెంట్లను కేటాయించినట్లు తహశీల్దార్ తెలిపారు. పెదకాకానిలో ఎస్సీలకు 50 ఏళ్లుగా శ్మశానం లేకపోవడంతో స్థలం కేటాయించాలని అధికారులను కోరారని కోర్టుకు తెలిపారు. వీరద్దరి వాదనలు ఉన్న కోర్టు ‘పరమానంద్ కటార’ కేసులో సుప్రీంకోర్టు మనిషి మరణానంతరం భౌతికకాయానికీ హుందాతనం, గౌరవమర్యాదలు ఉంటాయని గుర్తించిందని తెలిపింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ మృతదేహాల హక్కుల రక్షణను కాపాడాలని సూచన చేసిందని పేర్కొంది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం, మున్సిపాలిటీ చట్టాల ప్రకారం శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలపై కోర్టు తెలిపింది. ప్రస్తుత కేసులో 95 సెంట్ల శ్మశానవాటిక భూమిలో 24 సెంట్లు ఎస్సీలకు కేటాయించే ప్రతిపాదన చట్టవిరుద్ధం కాదని పేర్కొంది. ఏ కోణంలో చూసినా అధికారుల చర్యలను తప్పుపట్టలేమని హైకోర్టు తీర్పు ఇచ్చింది. సర్వే నంబరు 153లో సర్వే చేయాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.
Also Read: Jagan Sharmila Rakhi : జగన్‌కు రాఖీ కట్టేందుకు షర్మిల వెళ్తారా..?