అన్నకు  రాఖీ కట్టేందుకు  షర్మిల తాడేపల్లికి వెళ్తారా..?  ప్రతీ ఏడాది సంప్రదాయాన్ని కొనసాగిస్తారా..? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాదు వైఎస్ వీరాభిమానుల్లోనూ వ్యక్తమవుతున్న సందేహం ఇది. ఎందుకంటే రాఖీ పండుగ వస్తే అన్నకు రాఖీ కట్టేందుకు షర్మిల వెళ్లడం...  వారి అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం చాలా ఏళ్ల నుంచి వస్తోంది. కానీ ఇప్పుడు  వారి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దీనికి కళ్ల ముందు జరిగిన కొన్ని ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు కుటుంబం మొత్తం కలిసి నివాళులు అర్పించలేదు. ఎవరికి వారుగా వెళ్లారు. ఎదురుపడకుండా ఉండటానికే వేర్వేరు సమయాల్లో వెళ్లారన్న ప్రచారం ఉంది. 
 





ఏపీ సీఎ జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు షర్మిల. వీరి మధ్య అనుబంధాన్ని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. అన్న కోసం వేల కిలోమీటర్లు నడిచిన గుండె ధైర్యం ఆమెది. అన్న వదిలిన బాణాన్ని అని నిర్మోహమాటంగా చెప్పిన పట్టుదల ఆమెది. చెల్లి కోసం ఏం చేయడానికైనా వెనుకాడని మనస్థత్వం అన్న జగన్‌ది. వారి అనుబంధానికి సాక్ష్యం  వారు జరుపుకునే రాఖీ వేడుకలే . ప్రతీ సంవత్సరం రాఖీ పండుగ రోజు ...జగన్ నివాసానికి వెళ్లి రాఖీ కడతారు. జగన్ కూడా షర్మిలకు తాను రక్షణగా ఉన్నాననే భరోసాను బహుమతిగా ఇస్తారు. తన ఆనందాన్ని ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా పంచుకుంటారు. అందుకే ఈ సారి వెళ్తారా లేదా అన్న ఆసక్తి పెరిగింది. 


వైఎస్ఆర్ జయంతి రోజునే.. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రకటించారు షర్మిల. అదే రోజు తన అన్న జగన్ పై  కామెంట్లు చేశారనే చర్చ జరిగింది. అంతకుముందు షర్మిలపై జగన్ పరోక్షంగా కామెంట్స్ చేశారనే వార్తలూ వచ్చాయి. కొన్ని రోజుల క్రితం వరకూ వారిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని సన్నిహితులు చెబుతున్నారు. కానీ.. పార్టీ ప్రకటన సమయంలో జరిగిన పరిణామాలతో దూరం పెరిగిందనే మెసేజ్ ఓ విధంగా జనాల్లోకి వెళ్లినట్టైంది. కొన్ని కామెంట్లు, పంచ్ లు ఇద్దరు కావాలనే వేసుకున్నారనే మాటలు వినిపించాయి. 
 


కొన్ని రోజుల క్రితం.. తెలుగు రాష్ట్రాల జలవివాదాలపై  మాట్లాడిన జగన్.. పక్క రాష్ట్రాల రాజకీయాల్లో వేలు పెట్టడం ఇష్టం లేదంటూ చెప్పారు. ఆ తర్వాత దానికి కౌంటర్ అన్నట్టు.. పార్టీ ప్రకటన రోజు షర్మిళ పంచ్ లు విసిరారు. అప్పులు లేకుండా అభివృద్ధి సాధించడమే లక్ష్యమని షర్మిల చేసిన కామెంట్స్ తో పరోక్షంగా అన్న జగన్ ను విమర్శించినట్టైందని చర్చ నడిచింది. కలిసి భోజనం చేసి.. స్వీట్లు తినిపించుకునేంత క్లోజ్ ఉన్నప్పుడు కూర్చొని జలవివాదంపై మాట్లాడుకోలేరా అంటు షర్మిల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ మాటలతో కేసీఆర్ తో పాటు జగన్ పైనా షర్మిల కామెంట్స్ చేశారు. 


షర్మిల తెలంగాణలో సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. అది అన్నకు ఇష్టం లేదని ఆమె స్వయంగా చెప్పారు. అదే సమయంలో ఇటీవలి కాలంలో వారి మధ్య పలకరింపులు లేవు.   ఇలాంటి కొన్ని పరిణామాల కారణంగా ఇంతకీ జగన్ కు షర్మిల రాఖీ కడతారా? అనే చర్చ నడుస్తుంది. లేదు లేదు.. రక్త సంబంధం కదా.. వాళ్ల గొడవలు వ్యక్తిగతం కాదని కొందరు అంటున్నారు.. ఇంట్లో జరుపుకొనే పండగకు రాజకీయానికి సంబంధం ఏంటని చెబుతున్నారు. ఎలాగైనా ఇంట్లో ఆనందంగా గడుపుతారంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో..!?