పీఆర్సీపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఉద్యోగులకు మధ్య వారధిగా వ్యవహరించాల్సిన సీఎస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ ఆరోపించారు. ఫిట్‌మెంట్‌ 23 శాతం ఆమోదయోగ్యం కాదని ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ అంశాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. పీఆర్సీ జీవోలపై ప్రభుత్వం పునః సమీక్ష చేయాలన్నారు. మధ్యంతర భృతిని తిరిగి రికవరీ చేస్తామనడం ఏమిటో అర్థం కావడంలేదన్నారు.  ఇలా రికవరీ చేసిన పరిస్థితి చరిత్రలో లేదన్నారు. సీఎంను అధికారులు తప్పుదోవ పట్టించారని అభిప్రాయపడ్డారు. 


Also Read: అప్పుడే ఉద్యోగులంతా ఏకమై వ్యతిరేకిస్తే బాగుండేది.. దారుణమైన పీఆర్సీ ప్రకటించారు


జీతాల్లో కోతపడే ప్రమాదం


ఏ సీఎం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని అనుకోవడంలేదని సూర్యనారాయణ అన్నారు. సెంట్రల్‌ పే కమిషన్‌ అమలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగులపై అధికారాన్ని వదిలేసుకుంటారా అని ప్రశ్నించారు. సీఎం నేతృత్వంలో కమిటీ నియమించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఐఆర్‌ను కొనసాగించాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవో వల్ల 4 నుంచి 12 శాతం జీతం కోతపడే ప్రమాదం ఉందని సూర్యనారాయణ అన్నారు. 


Also Read: పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదన్న ఏపీ ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు సిద్ధమని ప్రకటన !


జీవోలు ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు


పీఆర్సీపై ఏపీ స‌ర్కారు జారీ చేసిన జీవోలపై ఉద్యోగ‌, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన బాటపడుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు వ్యతిరేకంగా ఉన్న జీవోలను రద్దు చేయాలని కోరుతూ విజయవాడ రూరల్ మండల కార్యాలయం వద్ద ఫ్యాప్టో ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళనకు ఫ్యాప్టో ఛైర్మన్ సుధీర్ జోసఫ్ కో చైర్మన్ ఎం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అలంకార్ ధర్నా చౌక్ వద్ద వీఎంసీ జేఏసీ నాయకుడు మూకల అప్పారావు ఇంతియాజ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా  రెండు చోట్లా జీవో కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనంతరం యూనియన్ నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పీఆర్సి, హెచ్ఆర్ఎలో కోత, సీసీఎ రద్దు వల్ల ఉద్యోగులకు 10 నుంచి 20 శాతం మేర జీతాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు. ఇకపై ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేది లేద‌ని స్పష్టం చేశారు. ఇరు జేఏసీల ఆధ్వర్యంలో 20వ తేదీన సమావేశమై కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. జీవోలు ఉపసంహరించుకునే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.


సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి


పీఆర్సీ జీవోలపై సచివాలయ ఉద్యోగుల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచివాలయంలో రెండు గంటల పాటు సమావేశమైన సచివాలయ ఉద్యోగుల సంఘం.... పీఆర్సీ జీవోలు జారీ చేసిన విధానంపై చర్చించారు. ఫిట్మెంట్, హెచ్ ఆర్ఏ భారీగా తగ్గించడంపై ఉద్యోగుల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవోలపై రేపటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేయాలని సచివాలయ ఉద్యోగులు భావిస్తున్నారు.


Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు