ఏపీలో ఉద్యోగులను ఆర్థికంగా కుంగదీసేలా పీఆర్సీ జీవోలు ఉన్నాయని.. ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. రెండేళ్లు పదవి విరమణ వయసు పెంచారని ఆనందపడ్డారని చెప్పారు. 23 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చినప్పుడు ఉద్యోగులంతా ఏకమై వ్యతిరేకిస్తే బాగుండేదని అశోక్ బాబు అన్నారు. జరుగుతున్న అన్యాయంపై అప్పుడే ప్రశ్నించి ఉండే.. ఇంత దూరం వచ్చేది కాదన్నారు. ఉద్యోగ సంఘాల తీరుతోనే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. 14 లక్షల ఉద్యోగుల జీతభత్యాలపై ఆలోచించాల్సిన అవసరం తప్పకుండా ఉందన్నారు. ఉద్యోగ సంఘాల జేఏసీలో ఉన్నత స్థానాల్లోని వారు సరిగా మాట్లాడాలని హితవు పలికారు. వారి మాటలే.. ఉద్యోగుల భవిష్యత్‌ను నిర్దేశిస్తాయని.. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అశోక్ బాబు అన్నారు.
'చరిత్రలో దుర్మార్గంగా మిగిలిపోయే పీఆర్సీని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఉద్యోగులు ఈ ప్రభుత్వానికి ఓటేశారన్న విశ్వాసాన్ని కూడా సీఎం పట్టించుకోలేదు. ఉద్యోగులు భౌతిక పోరాటం చేయకుండా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా పోరాడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రభుత్వం జీవోలు జారీ చేసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు ఎంత గింజుకున్నా ఉపయోగం ఉండదు. నేను టీడీపీ నేతగా కాకుండా, మాజీ ప్రభుత్వ ఉద్యోగిగానే మాట్లాడుతున్నాను. ఉద్యోగ సంఘాల నేతల వైఖరితో దాదాపు 14 లక్షల మంది ఉద్యోగులు తీవ్రంగా నష్టపోయారు.' అని ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఆర్సీపీ ప్రకటనపై అసంతృప్తి
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదని చెబుతున్నాయి. రెండు ప్రధాన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఈ పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇంత వరకూ ఏ ప్రభుత్వం కూడా ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తగ్గించలేదన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తగ్గించడమే కాకుండా.. హెచ్‌ఆర్‌ఏ, సీసీే రిటైరైన ఉద్యోగులతో క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ సహా అనేక అంశాల్లో కోతలు పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. జీవోలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాలతో ఎవరూ మాట్లాడకుండా జీవో జారీ చేశారని ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఉద్యోగ ఉపాధ్యాయయులపై ప్రేమ లేదని.. డీఏ లు అడ్డుపెట్టుకుని పిఆర్సీ ఇచ్చారని మండిపడ్డారు. మాకు ఈ పిఆర్సీ ఆమోదయోగ్యమైనవి కాదని..పిఆర్సీకి జీఓలు మాకు వద్దని ప్రకటించారు. ప్రభుత్వం మాకు వ్యతిరేకంగా జీఓ లు ఇచ్చిందని..ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఏక తాటి పైకి వచ్చి ప్రకటించే కార్యాచరణ అమలు చేస్తామని ప్రకటించారు. సమ్మె కు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నామని..సీఎం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. రేపు, ఎల్లుండి ఉద్యోగ కమిటీ సమావేశాలు పెట్టుకుని కార్యాచరణ ఖరారు చేస్తామని.. ప్రకటించారు. ఇప్పటికే అన్ని జిల్లాలో నల్ల బ్యాడ్జీ లతో నిరసన తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వం జీవోలు వెనక్కి తీసుకునేవరకూ ఉద్యమం చేస్తామని ప్రకటించారు.