AP Government Funds To Free Gas Cylinder Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఉచిత గ్యాస్ సిలిండర్ల (Free Gas Cylinder) పథకానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. ఈ పథకం రాయితీ నిధులు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గ్యాస్ కంపెనీలు, పౌర సరఫరాలశాఖ తెరిచిన ఖాతాలో ఈ నిధులు జమ చేయనున్నారు. సూపర్ సిక్స్ హామీల అమల్లో భాగంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఓ సిలిండర్ రాయితీ మొత్తం రూ.895 కోట్లు విడుదల చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 


దీపావళి నుంచి ప్రారంభం


ఈ నెల 31 నుంచి దీపావళి సందర్భంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధిదారులకు 2 రోజుల్లో వారి బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ నగదు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎల్పీజీ కనెక్షన్ కలిగి అర్హత గల ప్రతీ కుటుంబానికి ఈ పథకం వర్తింపచేయాలని స్పష్టం చేశారు. గ్యాస్ సిలిండర్ రిటైల్ మార్కెట్ ధర రూ.876 కాగా.. కేంద్రం ప్రతి సిలిండర్‌కు రూ.25 సబ్సిడీ ఇస్తుండగా.. ప్రస్తుతం ప్రతీ సిలిండర్ ధర రూ.851గా ఉంది. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ వల్ల ప్రభుత్వంపై రూ.2,684 కోట్ల భారం పడనుంది. ఐదేళ్లకు రూ.13,423 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


రాష్ట్రంలో అర్హులైన మహిళలందరికీ పారదర్శక విధానంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులు ప్రతి 4 నెలల వ్యవధిలో ఎప్పుడైనా ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పొందే విధంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పింది. ఈ పథకం ద్వారా పేదల జీవన ప్రమాణం పెరుగుతుందని సర్కారు భావిస్తోంది.


ఈ కేవైసీ తప్పనిసరి


మరోవైపు, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డులను ప్రాతిపదికగా తీసుకొని వంట గ్యాస్ సిలిండర్ రాయితీ ఇస్తామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వంట గ్యాస్ ఆన్‌లైన్‌లో బుక్ చేస్తున్నప్పటికీ.. ఆధార్, ఫోన్ నెంబర్ ఆధారంగా బుకింగ్ అవుతోంది. రాయితీ పొందాలంటే రేషన్ కార్డుల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ఈ వివరాలు ఎలా పొందుపరచాలనే దానిపై స్పష్టత కొరవడినట్లు తెలుస్తోంది. దీనిపై పౌర సరఫరాల శాఖ అధికారులకు పూర్తి సమాచారం రాలేదు. అటు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి ప్రభుత్వం ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.47 కోట్ల మంది తెల్లరేషన్ కార్డుదారులు ఉండగా.. అందులో ఇప్పటివరకూ 20 లక్షలకు పైగా గ్యాస్ ఏజెన్సీల వద్ద ఈ కేవైసీ చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఈ కేవైసీ కాకుంటే గ్యాస్ కంపెనీల వద్ద ఉండే డేటా, ప్రభుత్వం వద్ద ఉండే డేటా సరిపోయే అవకాశాలు లేవు. దీంతో పెద్ద సంఖ్యలో వినియోగదారులు ఈ కేవైసీ నమోదు కోసం గ్యాస్ ఏజెన్సీల వద్దకు వెళ్తున్నారు.


పథకం అమలు ఇలా



  • ఈ నెల 29వ తేదీ నుంచి గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం. బుక్ చేసుకోగానే లబ్ధిదారుని ఫోన్ నెంబరుకు సందేశం వెళ్తుంది.

  • పట్టణ ప్రాంతాల్లో 24 గంటల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో సిలిండర్లు డెలివరీ చేస్తారు. డెలివరీ అయిన 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుని ఖాతాలో రాయితీ సొమ్ము జమ అవుతుంది.

  • ఈ పథకం అమలుకై 3 బ్లాక్ పీరియడ్లుగా పరిగణిస్తారు. మొదటి బ్లాక్ పీరియడ్ ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు, రెండో బ్లాక్ పీరియడ్ ఆగస్ట్ 1 నుంచి నవంబర్ 31 వరకూ, మూడో బ్లాక్ పీరియడ్ డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకూ పరిగణిస్తారు.

  • మొదటి సిలిండర్ మార్చి 31లోపు, రెండోది జులై 31లోపు, మూడోది నవంబర్ 30లోపు ఎప్పుడైనా పొందొచ్చు. పథకం అమల్లో ఏమైనా సమస్యలు ఎదురైతే టోల్ ఫ్రీ నెంబర్.. 1967కు ఫోన్ చేసి ఫిర్యాదు చెయ్యొచ్చు.


Also Read: Andhra Pradesh: విద్యుత్ చార్జీలు పెంచాలని కోరింది ఎమ్మెల్యే జగన్ రెడ్డి - మంత్రి గొట్టిపాటి సంచలనం