New Portal For Sand Booking In AP: ఏపీలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఇసుక బుక్ చేసుకునేలా ఆన్ లైన్‌లో వెసులుబాటు ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశించారు. ఉచిత ఇసుక విధానంలో భాగంగా ప్రజలు ఆన్ లైన్‌లో ఇసుక బుక్ చేసుకునేందుకు వీలుగా ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్‌ను (AP Sand Management Portal) ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రజలకు పరిమితంగా కొంత సమయం అనే నిబంధన వద్దని.. ఎవరైనా, ఎక్కడినుంచైనా, ఏ సమయంలోనైనా సులువుగా ఇసుక బుక్ చేసుకునేలా పోర్టల్‌ను ఆధునీకరించాలని సూచించారు. ఏయే నిల్వ కేంద్రాల్లో ఎంత ఇసుక అందుబాటులో ఉందనేది ఆన్ లైన్‌లో మరుసటి రోజు కనిపిస్తుందని అధికారులు సీఎంకు వివరించగా.. దీన్ని వారం రోజులకు పెంచాలని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా, దారి మళ్లించేందుకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టాలని.. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని నిర్దేశించారు. ప్రభుత్వం ఉచిత ఇసుక విధానానికి కట్టుబడి ఉందని.. పారదర్శకతకు పెద్దపీట వేయాలని అన్నారు. వాగులు, వంకలకు సమీపంలో ఉండే గ్రామాలకు చెందినవారు వ్యక్తిగత అవసరాలకు కనీస రుసుము చెల్లించకుండా పూర్తి ఉచితంగా తీసుకెళ్లేలా నిబంధనలు రూపొందించాలన్నారు.


ఆన్ లైన్ బుకింగ్ ఇలా..



  • ఇసుక ఆన్ లైన్ బుకింగ్ కోసం ప్రజలు mines.ap.gov.in కు వెళ్లి.. ఏపీ శాండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (APSMS) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్స్‌పై క్లిక్ చేసి.. జనరల్ కన్స్యూమర్, బల్క్ కస్టమర్, ట్రాన్స్‌పోర్టర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్స్‌లో.. జనరల్ కన్స్యూమర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.

  • అనంతరం ఆధార్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసిన అనంతరం మొబైల్ నెంబర్ యూజర్ నేమ్‌గా వస్తుంది. ఆధార్ ప్రకారం పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఆ తర్వాత ప్రత్యామ్నాయంగా ఉండే మరో ఫోన్ నెంబర్, మెయిల్ ఐడీ, జిల్లా/గ్రామం/పట్టణం, మండలం/మున్సిపాలిటీ, వార్డు, చిరునామా, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్ ఎంటర్ చేసి.. రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయాలి. దీంతో రిజిస్టర్ అయినట్లు మెసేజ్ వస్తుంది.

  • ఈ రిజిస్ట్రేషన్ నెంబర్‌తో జనరల్ కన్స్యూమర్ కస్టమర్‌లో లాగిన్ కావాలి. డ్యాష్ బోర్డులో శాండ్ బుకింగ్స్‌పై క్లిక్ చేసి.. నిర్మాణం చేయదలుచుకున్న దాని వివరాలు, అడ్రస్ నమోదు చేయాలి.

  • అనంతరం ఇసుక డెలివరీ చేయాల్సిన చిరునామా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత గూగుల్ శాటిలైట్ మ్యాప్‌లో ఆ ప్రాంతం కనిపిస్తుంది. దీని కింద ఉన్న సేవ్‌పై క్లిక్ చేస్తే.. ఇసుక ఆర్డర్ వివరాలన్నీ కనిపిస్తాయి. 

  • ఆ తర్వాత ఇసుక నిల్వలు అందుబాటులో ఉన్న కేంద్రం, వాహనం, ఎంత పరిమాణం అనే వివరాలు కనిపిస్తాయి. ఇసుక నామమాత్రపు ధర, రవాణా ఛార్జీతో కలిసి ఎంతవుతుందో కనిపిస్తుంది. దీనికి పే ఆప్షన్ క్లిక్ చేయాలి. నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డు, యూపీఐ పే వంటి ఆప్షన్లలో ఏదో ఒకదాని ద్వారా డబ్బులు చెల్లించాలి. అనంతరం ఏ రోజు, ఎన్ని గంటలకు ఇసుక డెలివరీ అవుతుందో మొబైల్‌కు మెసేజ్ వస్తుంది.


Also Read: Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదంపై తొలిసారి స్పందించిన పవన్ కల్యాణ్ - బాధ్యులపై కఠినచర్యలు ఉంటాయన్న డిప్యూటీ సీఎం