Sankashti Ghaturthi September 2024: సంకట హర చవితి రోజు  వినాయక పూజకి చాలా ప్రాధాన్యత ఉంది. వ్యక్తిగత జీవితంలో , ఉద్యోగం, వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను గణనాథుడు తొలగించి సంతోషం నింపుతాడని భక్తుల విశ్వాసం. ప్రతి నెలలో రెండు చుతర్థిలు వస్తాయి.. ఒకటి శుక్ల పక్షంలో రెండోది బహుళ పక్షంలో. అయితే ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు. పౌర్ణమి ముందు వచ్చే చతుర్థిరోజు ప్రత్యేకత ఉండదు..కానీ భాద్రపదమాసంలో వచ్చే రెండు చవితిలు, రెండు చతుర్థిలు అత్యంత విశేషమైనవి. పౌర్ణమి ముందు వచ్చే చవితి రోజు వినాయక పూజ చేసుకుంటారు..అక్కడి నుంచి సరిగ్గా 11 రోజులకు వచ్చే చతుర్థి రోజు నిమజ్జనోత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత అమావాస్య ముందు వచ్చే చవితి రోజు సంకటహర చవితి జరుపుకుంటారు..చతుర్థి రోజు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. 


Also Read: దసరా సెలవులలో మీ పిల్లలకు ఇవి నేర్పించండి!


భాద్రపదమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే తదియను ఉండ్రాళ్ల తద్దిగా...ఆ తర్వాత రోజు వచ్చే చవితిని సంకటహర చవితిగా జరుపుకుంటారు. 


సెప్టెంబరు 20 ఉండ్రాళ్ల తద్ది


అట్లతద్దికి ఎలాంటి నియమాలు పాటిస్తారో ఉండ్రాళ్లతద్దికి కూడా అవే నియమాలు పాటించాలి. ఈ నోము గురించి శివుడే స్వయంగా పార్వతీదేవికి చెప్పాడని పురాణాల్లో ఉంది.ఈ నోము చేస్తే అవివాహితులకు మంచి భర్త లభిస్తాడని... వివాహితుల జీవితం సంతోషంగా సాగిపోతుందని విశ్వసిస్తారు. పెళ్లైన ఆడపిల్లలు ఏడాదికే ఈ నోము ప్రారంభించి పదేళ్ల పాటూ నోచుకుంటారు.. ఆ తర్వాత అట్లతద్ది నోములా ఉద్యాపన చేస్తారు.  భర్త, సంతానం ఆయురారోగ్యాలతో ఉండాలని, సంతానం లేనివారు సంతానం కలగాలని గౌరీదేవిని, గణేషుడిని ప్రార్థిస్తూ చేసే నోము ఉండ్రాళ్లతద్ది. సూర్యోదయానికి ముందే అన్నం తిని..రోజంతా ఉపవాసం చేసి చంద్రోదయం అయిన తర్వాత ఉండ్రాళ్లను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి...గౌరీదేవి పూజ చేసి..ముత్తైదువులకు వాయనం ఇస్తారు.  


Also Read: ఆయుధ పూజ దసరా సమయంలోనే ఎందుకు చేస్తారు!


సెప్టెంబరు 21 సంకటహర చవితి 


ప్రతి పూజకు తిథి ఉదయానికి ఉండడం ప్రధానం అయితే సంకటహర చవితి, చతుర్థికి తిథి చంద్రోదయానికి ఉండేలా చూసుకుంటారు. 


సెప్టెంబరు 20 శుక్రవారం తదియ రాత్రి 1.35 వరకూ ఉంది ఆ తర్వాత చవితి ఘడియలు ప్రారంభమయ్యాయి
సెప్టెంబరు 21 శనివారం చవితి రాత్రి 1.18 వరకూ ఉంది..ఆ తర్వాత పంచమి ఘడియలు మొదలయ్యాయి..


అంటే సెప్టెంబరు 21 శనివారం సూర్యోదయం , చంద్రోదయం సమయానికి చవితి ఘడియలున్నాయి..అందుకే సంకటహర చవితి పూజ ఈ రోజే ఆచరించాలి. పితృపక్షంలో వచ్చే సంకటహర చవితిని అత్యంత విశిష్టమైనదిగా భావిస్తారు. 


Also Read: దసరా వచ్చేస్తోంది.. ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించేందుకు ఈ వాస్తు సూత్రాలు పాటించండి!


సంకటహర చవితి రోజు గణనాథుడిని పూజిస్తే జ్ఞానం, అదృష్టం , ఆధ్యాత్మిక సిద్ధి ఉంటుందని నమ్ముతారు. ఈ రోజంతా ఉపవాసం ఉండి చంద్రోదయం అయన తర్వాత గణేషుడికి మోదకాలు సమర్పిస్తారు. మీరు ఎదుర్కొంటున్న కష్టాల నుంచి ఉపశమనం లభించాలని.. మంచి మార్గంలో నడిచేలా దీవించాలని భగవంతుడిని భక్తితో నమస్కరించాలి.