Pawan Kalyan Responds On Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ఈ అంశంపై ట్విట్టర్‌లో ఓ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుకు ఆయన రిప్లై ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ అంశంపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీసిందని.. వైసీపీ హయాంలో ఉన్న టీటీడీ బోర్డే దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. ఇలాంటివి దేవాలయాలు, వాటికి సంబంధించిన భూ సమస్యలు, ఇతర ధార్మిక పద్ధతులకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావిస్తాయని చెప్పారు.






సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటుపై..


ఈ సందర్భంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటుపై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలకు సంబంధించిన పలు అంశాలు, ధార్మిక పద్ధతులు, అన్ని సమస్యలు పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మ రక్షణ బోర్డు'ని ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయ స్థాయిలో చర్చ జరగాలని.. సనాతన ధర్మానికి ఏ రూపంలో ముప్పు వచ్చినా మనమంతా కలిసికట్టుగా నిర్మూలించాలని పేర్కొన్నారు. 


ఇదీ వివాదం


కూటమి 100 రోజుల పాలన సందర్భంగా ఏర్పాటు చేసిన నేతల సమావేశంలో సీఎం చంద్రబాబు వైసీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని.. లడ్డూ తయారీ కోసం వాడే నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలిపిందంటూ ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగింది. సీఎం వ్యాఖ్యలపై వైసీపీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి.. దీనిపై దేవుని సన్నిధిలో ప్రమాణం చేద్దామంటూ సవాల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ నేత ఆనం దీనికి సంబంధించిన రిపోర్డులను బయటపెట్టారు. 


జగన్ హయాంలో టీటీడీ మహా ప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో.. పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలగలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్‌కు చెందిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (NDDB) కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్లు టీడీపీ తెలిపింది. నెయ్యి పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని.. అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్రా కొవ్వులు కలగలిసి ఉన్నట్లు ఆ పరీక్షల్లో వెల్లడైనట్లు పేర్కొంది. అయితే, ఇలా నివేదిక బహిర్గతం అయిన గంటల వ్యవధిలోనే టీటీడీ నలుగురు సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించింది. వారంలో ఈ కమిటీ తన నివేదికను బోర్డుకు సమర్పించనుంది.


Also Read: Tirumala Laddu Row : తిరుమల లడ్డూ వివాదంపై టీటీడీ కీలక నిర్ణయం- కఠిన చర్యలు తప్పవని ఈఓ హెచ్చరిక