AP Government SIT On Attack On TDP Office: టీడీపీ కేంద్ర కార్యాలయంపై (TDP Central Office) దాడి ఘటనకు సంబంధించి విచారణకు ప్రభుత్వం సిట్ (SIT) ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఐపీఎస్ అధికారి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే గుంటూరు జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, ప్రజా ప్రతినిధులు, వేర్వేరు జిల్లాలకు చెందిన నేతలకు దాడితో సంబంధం ఉండడంతో సిట్ ద్వారా విచారణ చేయించాలని సర్కారు భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆదేశాలిచ్చింది.


8 మంది అరెస్ట్


గుంటూరు జిల్లా మంగళగిరిలోని (Mangalagiri) టీడీపీ కేంద్రం కార్యాలయంపై 2021, అక్టోబర్ 19న కొందరు దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనపై అప్పట్లో గుంటూరు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శించారు. వైసీపీ నేతలే దాడికి పాల్పడారని ఆరోపించారు. తాజాగా, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత ఈ దాడి ఘటనపై  పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ ఫుటేజీ, టోల్ ప్లాజా వద్ద సేకరించిన సమాచారంతో మొత్తం 27 మందిని నిందితులుగా గుర్తించారు. పలువురు వైసీపీ కీలక నేతలపై కేసు నమోదు చేశారు. దుండగుల్లో గుంటూరుకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలే ఎక్కువ మంది ఉన్నట్లు నిర్ధారించారు. నిందితుల కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న చాలామంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. గుంటూరుకు  చెందిన వెంకట్ రెడ్డి, మస్తాన్ వలి, దేవానందం, రాంబాబు, మొహియుద్దీన్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటివరకూ 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు.


వైసీపీ ఎమ్మెల్సీ పిటిషన్‌పై విచారణ వాయిదా


అటు, దాడి ఘటనకు సంబంధించి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది. దాడి వెనుక ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సైతం ఉన్నారని పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేరు చేర్చారు. దీంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు.


Also Read: Free Sand G.O in AP : ఏపీలో ఇక ఉచిత ఇసుక - సీఎం చంద్రబాబు విడుదల చేసిన మార్గదర్శకాలు ఇవే