సినిమాల్లో అశ్లీల సన్నివేశాలు, హింస, బూతు మాటలకు కత్తెర వేయడానికి సెన్సార్ ఉంటుంది. మరి, సోషల్ మీడియాకు? ఇటీవల కాలంలో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్, ట్విట్టర్.. ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తెరిచి చూసినా ముందుగా కనిపించేవి అసభ్యకరమైన పోస్టులే. వాటిని చూడకూడదు అనుకున్నా.. ఏదో ఒకలా కనిపిస్తూనే ఉంటాయి. సినిమా రివ్యూలు అంటూ ట్రోల్స్ అంటూ.. వెకిలి జోకులు సర్వసాధారణమైపోయాయి. కొందరైతే ఏకంగా పచ్చి బూతులను సైతం పోస్ట్ చేస్తున్నారు. మరి, వీటిని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పట్టించుకోవడం లేదా? కావాలనే వదిలేస్తున్నాయా? సినిమాలకు ఉన్నట్లుగా.. వీటికి సెన్సార్ ఎందుకు లేదు?


అసలు ఏమైందంటే?


ఇటీవల Phanumantu అనే యూట్యూబర్.. తన చానెల్‌లో ఓ వైరల్ వీడియోను ట్రోల్ చేస్తూ తండ్రి, కూతుళ్ల బంధాన్ని అవహేళన చేశారు. ఆ వీడియోలో తండ్రి కోపంగా కూతురుని కొట్టేందుకు అన్నట్లుగా బెల్ట్ తీస్తాడు. ఆ తర్వాత నవ్వుతూ అదే బెల్టు మీద కూర్చోబెట్టి ఊయల ఉపుతాడు. అయితే, దాన్ని ఆ యూట్యూబర్స్ తప్పుడు ఉద్దేశంతో కామెంట్లు చేశారు. తండ్రీకూతుళ్ల పవిత్ర బంధం గురించి నీచంగా మాట్లాడారు. ఆ వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. తిట్టడం మొదలుపెట్టారు. అది కాస్తా.. సెలబ్రిటీల వరకు చేరింది. దీంతో మంచు మనోజ్, సాయి ధరమ్ తేజ్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. చిన్నారిపై అలాంటి కామెంట్స్ చేసినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


యూట్యూబ్ చర్యలు తీసుకోదా?


వాస్తవానికి యూట్యూబ్‌.. చైల్డ్ పాలసీ చాలా కఠినంగా ఉంటుంది. పిల్లలను హింసించడం లేదా వారి స్వేచ్ఛకు భంగం కలిగించే సన్నివేశాలు, డైలాగ్స్ ఉన్నా.. వాటిని సీరియస్‌గా తీసుకుంటుంది. అయితే, Phanumantu యూట్యూబర్.. ఆ వీడియోను లైవ్‌లో పెట్టాడు. వారు అలాంటి కామెంట్స్ చేస్తున్నప్పుడే దాన్ని పలువురు రిపోర్ట్ కూడా చేసినట్లు సమాచారం. అయితే, దీనిపై యూట్యూబ్ వెంటనే ఎందుకు రియాక్ట్ కాలేకపోయిందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వారు తమ ఛానెల్‌ నుంచి ఆ వీడియోను తొలగించారు. అయినా సరే యూట్యూబ్ ఆ చానెల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఫనుమంతు యూట్యూబర్‌పై తెలంగాణ చైల్డ్ యాక్ట్ కింద చర్యలు తీసుకొనే అవకాశాలున్నాయి. అలాగే, అతడితో చర్చలో పాల్గొన్న ఇతర వ్యక్తులను కూడా ఇందులోకి చేర్చనున్నారు.  


రూల్స్ తప్పితే యూట్యూబ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?


యూట్యూబ్‌ ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలను సూచించింది. రూల్స్‌ను పాటించకుండా అభ్యంతరకర వీడియోలను పోస్ట్ చేసేవారిపై చర్యలు తీసుకుంటోంది. 18 ఏళ్ల లోపు చిన్నారులకు సంబంధించిన కంటెంట్‌పై యూట్యూబ్ ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు చెబుతోంది. కంటెంట్ అభ్యంతరకరంగా ఉన్నట్లయితే వెంటనే వీడియోను తొలగించి.. మెయిల్ ద్వారా యూట్యూబర్‌కు నోటీసులు పంపుతామని పేర్కొంది. సరైన వివరణ లభించనట్లయితే.. ఆ లింక్‌ను పూర్తిగా తొలగిస్తుంది. 


యూట్యూబ్ రూల్స్‌ను ఫస్ట్ టైమ్ ఉల్లంఘిస్తే జరిమానా ఉండదు. కేవలం వార్నింగ్ మాత్రమే ఇస్తుంది. ఈ హెచ్చరిక అందిన 90 రోజుల లోపు మళ్లీ నిబంధన తప్పినట్లయితే.. ఆ ఛానెల్‌పై స్ట్రైక్ పడుతుంది. ఆ 90 రోజుల్లో మరో రెండు స్ట్రైక్స్ పడినట్లయితే.. ఆ ఛానెల్‌ను యూట్యూబ్ తమ ప్లాట్‌ఫాం నుంచి పూర్తిగా తొలగిస్తుంది. అంటే అప్పటివరకు మీరు చేసిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. ఒక వేళ 90 రోజుల తర్వాత రూల్స్‌ తప్పితే వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. యూట్యూబ్‌లో కంటెంట్ పిల్లలకు ప్రమాదకరమని తెలిస్తే.. యూట్యూబ్ అప్రమత్తం అవుతుంది. పోలీసులకు కూడా సహకరిస్తుంది. కాబట్టి పిల్లల గురించి మాట్లాడినా, వారికి సంబంధించిన కంటెంట్ పెడుతున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే,  Phanumantu యూట్యూబ్ చానెల్‌పై ఎలాంటి చర్యలు తీసుకున్నాదో తెలియాల్సి ఉంది. 


అశ్లీలతకు సెన్సార్ ఏదీ?


యూట్యూబ్ సంగతి పక్కన పెడితే.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో కూడా చాలా అశ్లీల కంటెంట్ చక్కర్లు కోడుతోంది. దానివల్ల ఎంతోమంది బాధితులు అవుతున్నారు. బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనే కారణంతో చాలామంది దీనిపై నిశబ్దంగా ఉంటున్నారు. ఇక కొందరు అమ్మాయిలైతే.. అందాల ప్రదర్శనతోనే ఫాలోవర్లను పెంచుకుంటున్నారు. అలా చేస్తేనే తమకు ఫాలోవర్స్ పెరుగుతారనే ఉద్దేశంతో మరింత రెచ్చిపోతున్నారు. తమ అందాలను విచ్చలవిడిగా ప్రదర్శిస్తున్నారు. కొందరైతే సినిమాల్లోని అశ్లీల సన్నివేశాలను రీల్స్‌గా చేసి సోషల్ మీడియాలోకి వదులుతున్నారు. అంతేగాక కార్టూన్స్, జోక్స్ పేరుతో పచ్చి బూతులతో వీడియోలు చేస్తున్నారు. తప్పుదోవ పట్టించే థంబ్స్, టైటిల్స్ పెడుతూ మోసాలు చేస్తున్నారు.


పిల్లలపైనా ప్రభావం


ఇటీవల కాలంలో పిల్లలు కూడా సోషల్ మీడియా వీడియోలను అతిగా చూస్తున్నారు. ఈ అశ్లీల కంటెంట్ వారి కంట పడితే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు వెలుగు చూసినప్పుడు హాడావిడి చేసి చేతులు దులిపేసుకోకుండా.. సోషల్ మీడియాలో ట్రెండవ్వుతోన్న అశ్లీల కంటెంట్‌పై చర్యలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో గ్లామర్ షో చేసే సెలబ్రిటీలను సైతం వదలకూడదు. మీకు కూడా అలాంటి కంటెంట్ కనిపిస్తే రిపోర్ట్ చెయ్యండి (సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఆ ఆప్షన్ ఉంది). లేదా ఆ కంటెంట్‌ లింక్‌ను పోలీసులకు పంపి కూడా చర్యలు తీసుకోవచ్చు. 


Also Read: ప్రణీత్ హనుమంతు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏమిటి? ఏయే సినిమాల్లో నటించాడు?