AP Government Loans To Dwakra Womens: ఏపీ ప్రభుత్వం (AP Government) మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోంది. డ్వాక్రా సంఘాలకు (Dwakra Groups) మరింత చేయూతనిచ్చేలా అడుగులు వేస్తోంది. పొదుపు సంఘాల్లోని మహిళల జీవనోపాధి కల్పనకు బ్యాంకుల ద్వారా ఇస్తోన్న గ్రూప్ రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలు సైతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షన్నర మంది డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు రూ.2 వేల కోట్ల మేర వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సెర్ప్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకూ రుణంగా ఇప్పిస్తారు. సంఘంలో ఒకేసారి గరిష్టంగా ముగ్గురికి రుణాలు అందించే వెసులుబాటు ఉంది. ఇప్పటికే ఏదైనా జీవనోపాధి ఉన్న వారికి, కొత్తగా ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఈ రుణాలు అందిస్తారు.
'భవిష్యత్తులో రూ.10 లక్షలు'
రాష్ట్రంలో 1.35 లక్షల మందికి రూ.లక్ష మేర, 15 వేల మందికి రూ.5 లక్షల రుణాలు అందించనున్నారు. లబ్ధిదారుల ఆసక్తి, వారి జీవనోపాధి యూనిట్ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా ఈ రుణాన్ని భవిష్యత్తులో రూ.10 లక్షలకు కూడా పెంచుతామని అధికారులు వెల్లడించారు.
కేంద్ర పథకాలకు..
డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం (పీఎంఎఫ్ఎంఈ), ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) పథకాలను దీనికి అనుసంధానించాలని నిర్ణయించింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన జీవనోపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకున్న వారికి రుణంలో 35 శాతం రాయితీ వర్తిస్తుంది. ఉదాహరణకు రూ.లక్ష రుణం తీసుకుంటే వారికి రూ.35 వేలు రాయితీ కింద మినహాయిస్తారు. మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారులు నెలవారీ వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎంపిక చేసిన యూనిట్లను జీవనోపాధిగా ఎంచుకునే వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.
35 శాతం రాయితీ వర్తించే యూనిట్లు
- కారంపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకింగ్ యూనిట్
- తేనె తయారీ
- బేకరీ, స్వీట్ షాక్
- ఐస్ క్రీమ్ యూనిట్
- ఊరగాయల తయారీ, ప్యాకింగ్ యూనిట్
- వెజిటబుల్ సోలార్ డ్రయ్యర్
- అప్పడాల తయారీ యూనిట్
- భోజనం ప్లేట్ల తయారీ యూనిట్
- డెయిరీ, పౌల్ట్రీ యూనిట్
- డీజే సౌండ్ సిస్టమ్ వంటి యూనిట్లను రూ.లక్ష నుంచి రూ.5 లక్షలతో ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి 35 శాతం రాయితీ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది. అధికారంలోకి రాగానే పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ వంటి కీలక హామీలు నెరవేర్చింది. అలాగే, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకాన్ని సైతం త్వరలోనే అమలు చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్ట్ 15 నుంచి ఫ్రీ బస్ సర్వీస్ అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసే దిశగా సర్కారు అడుగులు వేస్తోంది.
Also Read: Andhra Pradesh: ప్రాణహాని ఉంది కాపాడండి- హోంమంత్రి అనితను కలిసిన ఫిర్యాదు చేసిన మదన్మోహన్