Telangana DGP Shared A Video: తెలంగాణ ప్రజలను పోలీసులు హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొందరు కేటుగాళ్లు పోలీస్ డీపీతో కాల్ చేసి మోసం చేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అపరిచితులు పోలీసులుగా తమను తాము పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారని తెలిపారు. మీకు సంబంధించిన వారు, మీ బంధువులు గానీ స్నేహితులు గానీ పట్టుబడ్డారని.. డ్రగ్స్ కొరియర్స్ వచ్చాయని.. మనల్ని మభ్యపెడతారని అన్నారు. పెద్ద తప్పు చేశారని టెన్షన్ పెట్టి బురిడీ కొట్టిస్తారని హెచ్చరించారు. అలాంటి వాటికి స్పందించవద్దని సూచించారు. ఓ వ్యక్తికి సైబర్ నేరగాడు తాను పోలీస్ అంటూ చేసిన ఫోన్ కాల్ వీడియోను డీజీపీ పోస్ట్ చేశారు.
రైతులనూ వదలడం లేదు
సైబర్ నేరగాళ్లు అటు రైతులను సైతం వదలడం లేదు. తెలంగాణ ప్రభుత్వం గురువారం రుణమాఫీ సొమ్ము అన్నదాతల ఖాతాల్లో జమ చేసిన సంగతి తెలిసిందే. దీన్ని అవకాశంగా తీసుకున్న కేటుగాళ్లు కొత్త దారుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. బ్యాంకు లోగోతో ఉండే వాట్సాప్ నెంబర్ల నుంచి ఫేక్ ఫైల్స్, ఏపీకే లింక్స్ పంపిస్తున్నారు. కొందరు అవగాహన లేని రైతులు పొరపాటును వాటిపై క్లిక్ చేస్తే పోన్ హ్యాక్‌కు గురవుతుంది. లేదా ఎనీ డెస్క్ వంటి యాప్స్ డౌన్ లోడ్ అయ్యి ఫోన్ మొత్తం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఈ క్రమంలో ఖాతాల్లోని డబ్బులు మాయం చేసే ప్రమాదం ఉంది. రుణమాఫీ డబ్బులు పడుతున్న వేళ కొందరికి వాట్సాప్ ద్వారా నకిలీ సందేశాలు వస్తున్నట్లు సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద లింకులతో ఈ సందేశాలు వస్తున్నాయని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వీటిని క్లిక్ చెయ్యొద్దని హెచ్చరిస్తున్నారు.
ఇలా మోసం చేస్తారు
రుణమాఫీ అర్హుల జాబితాలను మండలాలు, గ్రామాల వారీగా స్థానిక అధికారులు, అధికార పార్టీ నాయకుల వాట్సాప్ గ్రూపుల్లో విడుదల చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు అలాంటి జాబితాలు, బ్యాంకు లోగోలుండే వాట్సప్ ఖాతాల నుంచి ఫేక్ వెబ్ లింక్స్ పంపిస్తున్నారు. దీని ద్వారా ఫోన్ హ్యాక్ చేసి కాంటాక్ట్స్‌లోని కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులకు డబ్బు అవసరం ఉందని పంపడం సహా ఇతర సైబర్ నేరాల కోసం వినియోగిస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోసానికి గురైన వారు ఎవరైనా 1930కి కాల్ చేయాలని సూచిస్తున్నారు.
Also Read: Rythu Runamafi: తెలంగాణలో రుణమాఫీ నిధులు విడుదల - ఫేస్ 1లో రూ.6 వేలకోట్లకు పైగా జమ