Rythu Runa Mafi Telangana: తెలంగాణ సచివాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మొదటి విడతలో భాగంగా రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయడం కోసం ఏకంగా రూ.6,098 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీని ద్వారా 11.5 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది. రెండో విడతలో భాగంగా రూ.లక్షన్నర రుణమాఫీని ఈ నెలాఖరులోపు చేయనున్నారు. ఇక ఆగస్టు నెల దాటక ముందే రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేయనున్నారు. రైతుల రుణమాఫీ కోసం మొత్తంగా రూ.31 వేల కోట్లను ఖర్చు చేయనున్నారు.


తెలంగాణ సచివాలయంలో గురువారం (జూలై 18) ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన వివిధ జిల్లాల రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖిగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. పలుచోట్ల జిల్లాల్లో రైతు వేదికల్లో ఉన్న రైతులతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడేలా ఏర్పాట్లు చేశారు.


రైతులకు పండుగ రోజు - తుమ్మల


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఇది చారిత్రాత్మకరోజని, ఇది రైతులకు పండుగరోజని అన్నారు. ఇబ్బందులు ఎదురైనా, జనాలు అపహాస్యం చేసినా రైతుల రుణమాఫీ చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేస్తోందని.. బృహత్తర కార్యక్రమాన్ని కాంగ్రెస్‌ చేసి చూపించిందని అన్నారు.


ఈ కార్యక్రమంలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు  ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు ,సీఎస్ శాంతి కుమారి,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


గాంధీ భవన్ లో సంబరాలు
రైతు రుణమాఫీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుండడంతో గాంధీ భవన్ లో భారీగా సంబరాలు జరిగాయి. ప్రభుత్వం రూ.2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుకొని కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ, ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి, అధికార ప్రతినిధులు సత్యం శ్రీరంగం, కమల్ తదితరులు పాల్గొన్నారు.