Andhra Crime Politics :  ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా రాజకీయమే అవుతుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడినా రాజకీయమే అవుతుంది. నడి రోడ్డుపై హత్యలు జరిగినా రాజకీయమే అవుతుంది. రాజకీయ దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షం గగ్గోలు పెడుతుంది. వ్యక్తిగత కక్షలతో దాడులు చేసుకున్నా దానికి పార్టీలను పులిమేస్తున్నారు. ఇలా చేయడం వల్ల నేర తీవ్రత తగ్గిపోతోంది. దీని వల్ల రాజకీయ పార్టీలు లా అండ్ ఆర్డర్ కు పరోక్షంగా నష్టం చేస్తున్నాయి. వినుకొండ ఇష్యూలో జరుగుతున్న రాజకీయం చూస్తూంటే..  ఇక ఏం జరిగినా రాజకీయ పార్టీల ఖాతాల్లోనే రాసుకుంటారన్న  అభిప్రాయం వినిపిస్తోంది. 


వినుకొండలో జరిగిన హత్య పూర్తిగా వ్యక్తిగత కక్షలు !


వినుకొండలో రషీద్ అనే వ్యక్తిని  జిలానీ అనే  మరో వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. వీరిద్దరూ కొంత కాలం క్రితం వరకూ స్నేహితులు. తర్వాత శత్రువులు అయ్యారు. వ్యక్తిగత, కుటుంబ విషయాల కారణంగానే ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. కొద్ది రోజుల కిందట రషీద్ . జిలానీని కొట్టాడు.  పగతో రగలిపోయిన జిలానీ.. రషీద్ ను హత్య చేశాడు. వీరిద్దరి మధ్య గొడవలకు రాజకీయంతో సంబంధం పోలీసులు చెబుతున్నారు. మొదట్లో ఇద్దరూ వైసీపీలోనే ఉండేవారు. వైసీపీ మండల స్థాయి నేతకు అనుచరులుగా ఉండేవారు. ఆ నేత రౌడీషీటర్. ఇద్దరూ అనుచరులుగా ఉండేవారు. రషీద్ తో గొడవ అయిన తర్వాత ఎన్నికలకు ముందు జిలానీ టీడీపీలో చేరారు. కానీ వీరి గొడవలకు రాజకీయం కారణం కాదు. 


నిందితుడు ఏ పార్టీ వాడయితే ఏంటి.. శిక్షించాలి కదా ! 


నేరం జరిగిన వెంటనే నిందితుడు తెలుగుదేశం పార్టీ వాడని వైసీపీ కార్యకర్తలు ప్రచారం ప్రారంభించారు. చట్టం అందరికీ ఒకటే. రషీద్ టీడీపీ కార్యకర్త అయితే..ఆయనకు స్పెషల్ ప్రివిలేజెస్ ఉండవు. అలాంటివి చూపిస్తే ప్రభుత్వంసరిగ్గా నడవనట్లే. గతంలో చీరాలలో స్థానిక ఎన్నికల సందర్భంగా  బుద్దా వెంకన్న, బొండా ఉమలపై పట్టపగలు హత్యాయత్నం జరిగింది. ఆ కేసులో నిందితుడికి స్టేషన్  బెయిల్ ఇచ్చారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారు. అలాగే గతంలో టీడీపీ నేతలు, ఆఫీసులపై దాడులు చేసిన వారిపై కేసులు పెట్టలేదు. ఇలాంటివి జరగడం వల్ల ప్రభుత్వం పక్ష పాతంగా పని చేసింన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఇప్పుడు వినుకొండలో జరిగిన ఘటనలో నిందితుడ్ని వెంటనే పోలీసులు అరెస్టు చేశారు. 


నేరాల్లో రాజకీయం తెస్తే నిందితుడికి నైతిక మద్దతు ఇస్తున్నట్లు కాదా ? 


జిలానీై తెలుగుదేశం పార్టీ వాడని వైసీపీ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. కాదు వైసీపీ కార్యకర్త అని టీడీపీ ఫోటోలు, వీడియోలు రిలీజ్ చేసింది. ఆ నిందితుడు రెండు పార్టీల్లోనూ పని చేశాడు. అది నేరాలు చేయడానికి అర్హత ఎలా అవుతుంది. నేరం జరిగినప్పుడు నిందితుడి పార్టీతో సంబంధం లేకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలి. అధికార పార్టీలో ఉంటే ఆయన చేసిన నేరాలకు  సర్టిఫికెట్ వచ్చినట్లుగా కాదు. కానీ రాజకీయం చేయడం వల్ల.. నేరస్తుడికి అనవసరమైన సపోర్టు వచ్చేలా చేస్తున్నారు. టీడీపీ్ నేతే అనే ముద్ర వేయడం వల్ల వైసీపీ ఎలాంటి లాభం వస్తుందో కానీ. అలాంటి ముద్ర వేయగానే..టీడీపీ కూడా రివర్స్ లో చరిత్ర బయటకు తీసి ఆరోపణలు చేస్తోంది. 


ఏపీలో ప్రతీ నేరం రాజకీయ పరమైనదేనా ?


ప్రతి  చోటా ఏదో ఓ ఘటన.. నేరం జరుగుతూనే ఉంటుంది. అయితే ఏపీలో మాత్రం జరిగే ప్రతి నేరం వెనుక రాజకీయం ఉంటుంది. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా ఉండదు. అన్ని ప్రధాన పార్టీలూ ఈ ఆరోపణలు చేస్తూంటాయి. సంచలనాత్మక నేరంగా జరిగితే నిందితుడు మీ పార్టీ వాడేనని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. ఎక్కడైనా ఘర్షణ జరిగితే రాజకీయ  గొడవలే ఉంటారు. ఇలాంటి రాజకీయ.వల్ల నేరస్తులకు పార్టీలను అంట గట్టడం వల్ల నేర తీవ్రతపై ప్రభావం చూపుతోంది. రాజకీయ పార్టీలకు తెలియకుండానే  పెద్ద ఎత్తున  సమాజానికి నష్టం చేస్తున్నారు.