CM Revanth Reddy :   రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఇబ్బంది పడతారని విపక్ష పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి. ఎన్ని మార్గదర్శకాలు పెట్టి ఫిల్టర్ చేసినా సరే అమలు అసాధ్యమని అనుకున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో రూ. లక్ష రుణమాఫీ చేయడానికి కేసీఆర్ ఐదేళ్లు తంటాలు పడ్డారు. అయినా పూర్తిగా రుణమాఫీ చేయకుండానే ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్  వల్ల కానిది రేవంత్ రెడ్డి వల్ల అవుతుందా అన్న ప్రశ్నలు ఎక్కువగా వినిపించాయి. కానీ  రేవంత్  రెడ్డి మాత్రం.. రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీలోపు చేస్తామని పార్లమెంట్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఆ మేరకు అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. నిధులు లభ్యం కావడంతో ముందుగానే లక్ష రుణమాఫీ చేసేస్తున్నారు. గురువారం సాయంత్రం రైతుల ఖాతాల్లో రూ. లక్ష వరకూ జమ అవుతాయి. 


పెరగనున్న రేవంత్ ఇమేజ్


గురువారం ఏడు వేల కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. నెలాఖరున లక్షన్నర లోపు.. వచ్చే ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీని పూర్తి చేస్తారు. నిధుల సమీకరణపై స్పష్టమైన లక్ష్యంతో ఉండటంతో పూర్తి చేయడం పెద్ద కష్టం కాదని బావిస్తున్నారు. రెండు లక్షలు అంటే చిన్న  మొత్తం కాదు. రైతు కుటుంబాలకు ఎన్నో సమస్యల పరిష్కారం చేస్తాయి. అందుకే రేవంత్ రెడ్డి ఇమేజ్ ఆమాంతం పెరగడం ఖాయమని అనుకోవచ్చు. కుటుంబాన్ని యూనిట్ గా తీసుకున్నప్పటికీ.. ఆ కుటుంబాల ప్రాతిపదకిగా రేషన్ కార్డునే చూస్తున్నారు. ఈ కారణంగా ఒకే కుటుంబంలో ఇద్దరు లబ్దిదారులు అయ్యే అవకాశం ఉండదు.  చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మెజార్టీ రైతుల్లో .. రైతు కుటుంబాల్లో రేవంత్ రెడ్డికి సానుకూలత పెరుగుతుందని అనుకోవచ్చు. 


వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బ్రేక్ - చంద్రబాబు సైలెంట్‌గా పవర్ చూపించారా ?


రాజకీయంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి 


సీఎంగా బాద్యతలు చేపట్టిన తర్వాత మూడు నెలల పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో రేవంత్ ఏమీ చేయలేకపోయారు. మిగిలిన నాలుగు నెలల సమయంలో ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దిశగా కీలక అడుగులు వేస్తున్నారు. ఆర్థిక పరమైన సమస్యను సులువుగానే అధిగమిస్తుున్నారు. కానీ ఆయన ఉద్యోగాల భర్తీ, పరీక్షల విషయంతో పాటు శాంతిభద్రతలు..ఇతర విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నారు. పరీక్షలను వాయిదా వేయాలని పట్టుబడుతున్న విద్యార్తుల డిమాండ్ ను పట్టించుకోలేదు. వారి ఆందోళనలు తీవ్ర స్థాయికి చేరాయి. అలాగే మరికొన్ని హామీల అమలు విషయంలో ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్న నగదు తో పాటు మరికొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది. ప్రజల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతోందన్న అంచనాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో.. రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా గోల్ కొట్టారని అనుకోవచ్చు. 


బీఆర్ఎస్ కోసం ప్రజలే వెదుక్కుంటూ వస్తారా ? కేసీఆర్‌కు అంత నమ్మకం ఏమిటి ?


లబ్దిదారులను తగ్గించారని విపక్షాల ప్రచారం పనికొస్తుందా ?


రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్, బీజేపీ చెబుతూ వచ్చాయి. ఇప్పుడు అర్హుల్ని తగ్గించేశారని విమర్శలు గుప్పిస్తున్నారు. ధనవంతులకు రుణమాఫీ చేయకపోయినా వచ్చే వ్యతిరేకత ఏమీ ఉండదు. కానీ.. అర్హులైన వారికి మిస్ కానివ్వబోమని కాంగ్రెస్ సర్కార్ చెబుతోంది. మొత్తంగా అనేక సమస్యల మధ్య రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా రుణమాఫీతో తెరపైకి వచ్చేస్తున్నారు. వచ్చే నెలన్నర పాటు ఆయన ఈ జాతర నిర్వహిస్తారు. మొత్తం సమస్యలన్నింటినీ పరిష్కరించేసుకుని.. పాజిటివ్ వైబ్స్ ను పెంచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నయి. అయితే  ఈ ప్రక్రియను సజావుగా పూర్తి  చేయాల్సి ఉంటుంది. లేకపోతే కొత్త సమస్యలు వచ్చి  పడే అవకాశం ఉంది.