Vijayasai Reddy Alone in YSRCP :  ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్ఆర్‌సీపీ ఇప్పటికీ తేరుకోలేదు. ఆ పార్టీలోని కీలక నేతలు ఒకరిపై ఒకరు అంతర్గత రాజకీయాలు చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి పరోక్షంగా బయట పెట్టారు. వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి తాజాగా ఓ మహిళకు పుట్టిన బిడ్డ విషయంలో వివాదంలో చిక్కుకున్నారు. ఈ వివాదం సృష్టించినది సొంత పార్టీ నేతలేనని ఆయన అంటున్నారు. అయితే ఆ విషయాలను  విస్తృతంగా ప్రచారం చేసిన మీడియాపై ఆయన అసభ్యకరంగా తిట్లందుకున్నారు. అది కూడా వివాదాస్పదమయింది. ఇంత జరుగుతున్నా ఆయనకు సొంత పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు. వైఎస్ఆర్‌సీపీ ఆస్థాన మీడియాలోనూ ఆయనకు మద్దతు లేదు. ఒకప్పుడు ఆయన చుట్టూ తిరిగిన నేతలు ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడేందుకు రావడం లేదు. పార్టీ హైకమాండ్ కు ఇష్టం లేనందునే ఎవరూ సపోర్టు చేయడం లేదని.. అందుకే ఆయన సొంత చానల్ పెట్టుకుంటానని ప్రకటించారని అంటున్నారు. 


వైసీపీలో ఒంటరిగా విజయసాయిరెడ్డి


విజయసాయిరెడ్డి ఒకప్పుడు పార్టీలో నెంబర్ టూగా ఉండేవారు. కానీ ఇటీవల ఆయన నెంబర్ ఎంతో ఎవరికీ తెలియడం లేదు. జగన్ నివాసంలో ఆయన కనిపించి చాలా కాలం అయింది. నెల్లూరు జిల్లాలో విజయం కోసం ఆయన సీరియస్ గా ప్రయత్నించలేదన్న సమాచారం పార్టీ హైకమాండ్ కు ఉండటంతో జగన్ అసంతృప్తిగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. తర్వాత ఆయనను కేవలం రాజ్యసభ పక్ష నేతగా మాత్రమే ఖరారు చేశారు. పార్లమెంటరీ పార్టీ నేతగా వైవీ సుబ్బారెడ్డిని నియమించారు. ఆ తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత తగ్గిపోతూ వస్తోంది. తాజాగా ఆయనపై ఓ వివాదం బయటకు వచ్చింది. ఆ అంశంపై ఆయన ప్రెస్ మీట్ పెట్టేందుకు విశాఖ వచ్చారు. ఆయనతో పాటు ఆ మీడియా సమావేశంలో పాల్గొనేందుకు ఒక్క విశాఖ నేత కూడా రాలేదు. ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకర్ మాత్రమే వచ్చారు. ఆ తర్వాత కూడా ఆయనపై వస్తున్న విమర్శలకు..  ఆయనను సమర్థించేందుకు ఒక్కరూ ముందుకు రాలేదు. 


వృద్ధాప్యంలో  విజయసాయిరెడ్డికి మానసిక క్షోభ 


విజయసాయిరెడ్డి 70 ఏళ్లకు దగ్గర పడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ అధికారిణికి పుట్టిన బిడ్డకు ఆయనే తండ్రి అనే ఆరోపణలు వస్తున్నాయి. స్వయంగా ఆ ఆధికారిణి  భర్తే ఆ ఆరోపణలు చేయడంతో మీడియా విపరీతమైన హైప్ ఇచ్చింది. గతంలో వైసీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని కొన్ని మీడియా చానళ్లపై కేసులు పెట్టారు. ఆ చానళ్లు విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలను  ఎక్కువగా ప్రచారం చేశాయి. దీంతో ఆయన ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు. విశాఖలో మీడియా సమావేశం పెట్టి ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. మీడియాపై తిట్లందుకున్నారు. ఈ వ్యవహారంలో విజయసాయిరెడ్డి చాలా ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారు. ఈ వయసులో తనపై వచ్చిన నిందల్ని అందరూ నమ్మేలా ప్రచారం చేస్తున్నారని ఆయన బాధపడుతున్నారు. 


సొంత పార్టీ నుంచి మద్దతు దక్కకపోవడం అనూహ్యం


ఈ క్రమంలో ఆయనకు సొంత పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు. విజయసాయిరెడ్డి మంచోడని ఆయనపై కుట్ర చేస్తున్నారని ఒక్కరంటే ఒక్క వైసీపీ నేత ఆయనకు మద్దతుగా రాలేదు. చివరికి వైసీపీ ఆస్థాన మీడియాలనూ ఆయన వాదనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో విజయసాయిరెడ్డిది వ్యక్తిగత వివాదమని పార్టీతో సంబంధం లేదన్న సంకేతాలను పంపాలని వైసీపీ నిర్ణయించుకుందని అర్థమవుతుంది. అసలు విజయసాయిరెడ్డి తనపై కుట్ర సొంత పార్టీలోని ముఖ్య నేతలే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వారి గురించి తాను బండారం బయట పెడతానంటున్నారు. అంటే.. విజయసాయిరెడ్డి టీడీపీపైన లేదా మీడియాపైనకాదు.. సొంత పార్టీ నేతలపైనే  పోరాడుతున్నారని అనుకోవచ్చు. ఈ పోరాటంలో ఆయనకు జగన్ మద్దతు లభించడం లేదని అర్థమవుతుంది. ఆయన విజయసాయిరెడ్డికి అనుకూలంగా ఉంటే పార్టీ నేతలంతా మద్దతుగా ఉండేవారు. అలాగే వైసీపీ సానుకూలమీడియాలోనూ విజయసాయికి మద్దతు లేదంటే ఆయనను పార్టీ వద్దనుకున్నట్లే అనుకోవచ్చు. అందుకే విజయసాయిరెడ్డి సొంత మీడియా పెడతానని ప్రకటనలు చేశారని అంటున్నారు. 


విజయసాయిరెడ్డికి , వైసీపీకి ఎందుకు  దూరం పెరిగింది ?


2019 ఎన్నికల సమయంలో విజయసాయిరెడ్డి వైసీపీకి పిల్లర్ లా వ్యవహరించారు. ఆయనే అన్ని  వ్యవహారాలు చక్కబెట్టారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున జగన్ తన విజయానందాన్ని విజయసాయిరెడ్డితోనే మొదటగా పంచుకున్నారు. తర్వాత ఆయన ఉత్తరాంధ్ర ఇంచార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ్నుంచి జగన్ తో గ్యాప్ పెరుగుతూ వచ్చిందని చెబుతారు. ఆయన నెంబర్ టూ పొజిషన్‌ను సజ్జల రామకృష్ణారెడ్డి పొందారని అంటారు. ఇప్పుడు విజయసాయిరెడ్డికి పార్టీలో నిలువ లేకుండా పోయింది. ఈ మధ్యలో ఏం జిరగిందో ఆ పార్టీ నేతలకే ఎక్కువగా తెలుసని అంటున్నారు. 


బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు


విజయసాయిరెడ్డి బీజేపీలోచేరుతారన్న ఊహాగానాలు వినిపిస్తన్నాయి. ఆయనకు ఇంకా నాలుగేళ్లకుపైగా రాజ్యసభ పదవీ కాలం ఉంది. సొంత పార్టీలో దూరం పెడుతూండటంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కావడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆయన బీజేపీ హైకమాండ్ తో టచ్ లోకి వెళ్లారని చెబుతున్నారు. మొత్తంగా విజయసాయిరెడ్డి రాజకీయ జీవితం కీలక మలుపులు తిరగనుంది.