Divorces Among Indian Cricket Players: ఎన్నో ఆశలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన క్రికెటర్లు... అనంతరం విభేదాలతో విడిపోవడం  వారితో పాటు అభిమానులను కూడా తీవ్ర వేదనను మిగులుస్తుంది. భారత క్రికెటర్ల వ్యక్తిగత జీవితాలపైనా అభిమానులకు ఎనలేని ఆసక్తి ఉంటుంది. వారి జీవితాల్లో విభేదాలతో విడిపోతే బాధపడే అభిమానులు ఉంటారు. మైదానంలో ఎన్నో సవాళ్లను సమర్థంగా అధిగమించే క్రికెటర్లు.. వ్యక్తిగత జీవితంలో మాత్రం సవాళ్లు ఎదుర్కోవడంలో విఫలమవుతుంటారు. మైదానంలో ఆడడం కంటే కూడా వివాహ బంధాన్ని కొనసాగించడం, కీర్తి ప్రతిష్టలను కాపాడుకోవడం.లో సంక్లిష్టతలను ఎదుర్కొంటారు. వైవాహిక జీవితంలో కష్టాలను బహిరంగంగా అంగీకరించిన క్రికెటర్ల వ్యధలను మరోసారి తెలుసుకుందాం... 

 

1. మహ్మద్ షమీ- హసిన్ జహాన్ (Mohammad Shami and Hasin Jahan)

మహ్మద్ షమీ-హసిన్ జహాన్‌లు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. క్రికెటర్లలో వ్యక్తిగత జీవితంలో షమీ పడినన్నీ కష్టాలు మరొకరు పడలేదంటే అతిశయోక్తి  కాదు. 2014 లో మహ్మద్ షమీ-హసిన్ జహాన్‌ వివాహం చేసుకున్నారు. 2018 లో షమీపై  హసిన్ జహాన్ గృహ హింస  కేసు పెట్టింది. బహిరంగంగా కూడా షమీపై, ఆయన కుటుంబంపై సంచలన ఆరోపణలు చేసింది. షమీకి  వివాహేతర సంబంధాలు ఉన్నాయని, శారీరకంగా తనను వేధించాడని ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలు క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇప్పటికీ ఈ కేసులు కొనసాగుతున్నాయి. వీటిని తట్టుకునే వన్డే ప్రపంచకప్‌లో షమీ అద్భుత బౌలింగ్‌తో అలరించాడు.

 

2. దినేష్ కార్తీక్- నికితా వంజర (Dinesh Karthik and Nikita Vanjara)

టీమిండియాలో మోస్ట్‌ టాలెంటెడ్‌ క్రికెటర్‌గా గుర్తింపు ఉన్న సమయంలో  21 ఏళ్ల వయస్సులో  2007లో దినేష్ కార్తీక్ చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజరను వివాహం చేసుకున్నారు. ఇరువురి కుటుంబాలు మంచి స్నేహితులు కావడంతో వీరి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు రాలేదు. 2012లో క్రికెటర్ మురళీ విజయ్‌తో నికితా ఎఫైర్ నడుపుతున్నట్లు  దినేష్ కార్తీక్ తెలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కొద్ది కాలానికే దినేష్ కార్తిక్‌ విడాకులు తీసుకున్నాడు.  2012లోనే దినేష్ కార్తీక్- నికితా వంజర విడాకులు తీసుకున్నారు. కార్తీక్ 2015లో స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు.

 

3. శిఖర్ ధావన్- ఏషా ముఖర్జీ (Shikhar Dhawan and Aesha Mukerji)

2012లో  శిఖర్ ధావన్- ఏషా ముఖర్జీ పెళ్లి చేసుకున్నారు. 2009లో మెల్‌బోర్న్‌కు చెందిన ఏషా ముఖర్జీతో నిశ్చితార్థం చేసుకున్న ధావన్‌... 2012లో వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు జోరావర్ ధావన్ అనే 10 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఏషా, జోరావర్ ఇద్దరూ ఆస్ట్రేలియన్ పౌరులు. అక్కడే నివసిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడి నుంచి విడివిడిగా జీవించాలని ఒత్తిడి చేయడం ద్వారా ధావన్‌ను ఏషా మానసిక వేదనకు గురి చేసిందని ఢిల్లీ కోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఎలాంటి తప్పు లేకుండానే ధావన్ నుంచి జొరావర్‌ను ఏషా దూరంగా ఉంచడంతో ధావన్‌ తీవ్రమైన బాధను అనుభవించాడు.  అంతకుముందే ఏషాకు ఆస్ట్రేలియాకు చెందిన వ్యాపారవేత్తతో వివాహమైంది. అక్టోబర్ 2023లో ధావన్ భార్య నుంచి విడాకులు పొందాడు.

 

4. జవగళ్‌ శ్రీనాథ్‌-జ్యోత్స్న (Javagal Srinath and Madhavi Patravali)

భారత జట్టు మాజీ పేసర్‌ జావగల్ శ్రీనాథ్- జ్యోత్స్న కూడా వివాహ బంధాన్ని కొనసాగించలేకపోయారు. 1999లో శ్రీనాథ్ జ్యోత్స్నను వివాహం చేసుకున్నాడు. ఈ జంట 2007లో విడాకులు తీసుకుంది. ఒక సంవత్సరం వ్యవధిలోనే మాధవి పాత్రావళి అనే జర్నలిస్టును శ్రీనాథ్‌ మళ్లీ వివాహం చేసుకున్నారు.

 

5. హార్దిక్ పాండ్యా- నటాసా స్టాంకోవిచ్ (Hardik Pandya and Natasa Stankovic)

తన భార్య నటాసా స్టాంకోవిచ్‌తో  విడాకులు తీసుకున్నట్లు తాజాగా హార్దిక్ పాండ్యా  కూడా ప్రకటించాడు, వీరిద్దరి మధ్య సమస్యలు ఉన్నాయని కొన్ని నెలలుగా పుకార్లు వస్తున్నాయి. ఈ పుకార్లకు హార్దిక్‌ పాండ్యా ప్రకటనతో తెరపడింది. మే 31, 2020న, సెర్బియాకు చెందిన మోడల్,-నటి నటసాను హార్దిక్‌ పెళ్లి చేసుకున్నాడు. జూలై 18న ఉమ్మడి సోషల్ మీడియా ప్రకటన ద్వారా వారు విడిపోయిన విషయాన్ని ధృవీకరించారు. ఈ పోస్ట్‌లో తమ కుమారుడు అగస్త్యకు -తల్లిదండ్రులుగా ఉంటామని ప్రకటించారు.