Team India : టీమిండియాలో శుభ్‌మన్‌గిల్‌(Shubman Gill) కెప్టెన్సీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే జింబాబ్వే(ZIM) టూర్‌కు గిల్‌ను కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో శ్రీలంక(Srilanka)లో జరగనున్న వన్డే సిరీస్‌కు గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించింది. రిషబ్‌ పంత్‌(Rishab Panth), కేఎల్‌ రాహుల్‌(KL Rahul)లను కాదని... గిల్‌కు వైస్‌ కెప్టెన్సీ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. రోహిత్‌ శర్మ శకం ముగిసిన వెంటనే గిల్‌కు సారధ్య బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు దీంతో చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని మాజీ క్రికెటర్లు విశ్లేషిస్తున్నారు. మరోవైపు టీ 20 క్రికెట్‌లోనూ ఊహాగానాలను నిజం చేస్తూ హార్దిక్‌ పాండ్యా(Hardik)కు బదులుగా సూర్యకుమార్‌ యాదవ్‌(Surya Kumar Yadav)కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. జట్టులో హార్దిక్‌ ఉన్నా సూర్యాకే పగ్గాలు అప్పగించడంతో టీ 20లో ఇక సూర్యానే కెప్టెన్‌గా కొనసాగుతాడన్నది స్పష్టమైంది. ఇటు టీ 20ల్లోనూ శుభ్‌మన్‌ గిల్‌ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.




  

భవిష్యత్తు వ్యూహాల్లో భాగమే..

కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌లలో ఒకరిని లంకతో వన్డే సిరీస్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే ఈ అంచనాలను తలకిందులు చేస్తూ నయాస్టార్‌ శుభ్‌మన్‌ గిల్‌కు సెలెక్టర్లు వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే జింబాబ్వేతో జరిగిన T20I సిరీస్‌కు భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన గిల్‌ను ఈసారి అనూహ్యంగా  వన్డేల్లో వైస్‌ కెప్టెన్‌గా నియమించారు. గిల్‌ వన్డే ఫార్మాట్‌లో మొదటిసారి వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించిన బీసీసీఐ... మాజీ వైస్-కెప్టెన్ KL రాహుల్‌ను తిరిగి జట్టులోకి వచ్చినా... పంత్‌ మంచి ఫామ్‌లో ఉన్నా వారిద్దరిని కాదని గిల్‌కే ఆ బాధ్యతలు అప్పగించింది. కెరీర్‌లో చివరి దశకు సమీపించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానాల్లో కొత్తవారిని తీసుకొచ్చేందుకు బీసీసీఐ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు కె. ఎల్‌. రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరి మధ్య శ్రీలంక టూర్‌లో పెద్ద యుద్ధమే జరిగే అవకాశం ఉంది. ఇద్దరూ కీపర్లు కావడంతో వీరిద్దరిలో ఎవరికి అవకాశం ఇచ్చినా భారీ స్కోర్లు చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ స్థానాన్ని మరొకరితో భర్తీ చేసే అవకాశం  ఉంటుంది.

 

రాహుల్‌  భవితవ్యం ఏంటో..?

2023లో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత జట్టుకు రాహుల్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. టెస్ట్‌, వన్డే ప్రపంచ కప్‌లోనూ రాహుల్‌ కీపర్‌గా రాణించాడు. ఇటీవలే గాయం నుంచి కోలుకుని మంచి ఫామ్‌లో కూడా ఉన్నాడు. అయినా రాహుల్‌ను కాదని గిల్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించి బీసీసీఐ సెలెక్టర్లు సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు. పంత్‌ కూడా ప్రమాదం నుంచి కోలుకుని ఢిల్లీ క్యాపిటల్స్‌ తరపున ఐపీఎల్‌లో రాణించాడు. టీ 20 ప్రపంచకప్‌లోనూ పంత్‌ కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయినా పంత్‌కు వైస్‌ కెప్టెన్సీ ఇవ్వలేదు. కొత్తగా కోచ్‌ బాధ్యతలు చేపట్టిన గౌతం గంభీర్‌ కెప్టెన్సీ, జట్టు ఎంపిక విషయంలో చాలా స్పష్టతతో ఉన్నాడని.. భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.