AP Cancer Hospitals:  ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను అంతర్జాతీయ క్యాన్సర్‌ వైద్య నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్యాన్సర్‌ కేర్‌) పద్మశ్రీ డాక్టర్‌ నోరి దత్తాత్రేయుడు కలిశారు. క్యాన్సర్‌ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సీఎంతో చర్చించారు.  రాష్ట్రంలో తిరుపతి, గుంటూరు-విజయవాడ, విశాఖపట్నంలోని మూడు ప్రాంతాలలో కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ హాస్పిటల్స్, తిరుపతి ఆసుపత్రిలో చిన్నారులకు ప్రత్యేకంగా క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. సీఎం సూచనల మేరకు డాక్టర్‌ నోరి, అమెరికాలో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ కొండూరు తిరుపతిలో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌పై తిరుపతిలో సమీక్షించి ముఖ్యమంత్రికి నివేదిక అందించారు. క్యాన్సర్‌ చికిత్సతో పాటు స్క్రీనింగ్‌పై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అన్నారు.  క్యాన్సర్‌తో పాటు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై కూడా దృష్టిపెట్టాలని సీఎం అన్నారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించడం ద్వారా ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చన్నారు. క్యాన్సర్ ప్రాథమిక దశలోనే గుర్తించే విధంగా స్క్రీనింగ్ పరీక్షలు చేసేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 


Also Read: AP Cabinet : మంత్రుల్లో ఎవరెవరికి పదవీ గండమో చెప్పిన జగన్ - వాళ్లెవరంటే ?


పేదవాడికి క్యాన్సర్ చికిత్స అందించడమే లక్ష్యం 


ప్రతి పేదవాడికి క్యాన్సర్‌ చికిత్స అతి తక్కువ ధరకే అందేందుకు అవసరమైన ప్రణాళిక సిద్దం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్‌ చికిత్స కోసం కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ ఆస్పత్రులు పెట్టాలని, అందులో ఒకదాన్ని అత్యాధునికంగా ఏర్పాటుచేయాలన్నారు. సీఎం సూచనల మేరకు డీపీఆర్‌ సిద్ధం చేసిన డాక్టర్‌ నోరి ముఖ్యమంత్రితో ఇవాళ చర్చించారు. క్యాన్సర్‌ రోగులందరికీ అందుబాటులో ఉండేలా చికిత్సలను తీసుకురావాలన్న ముఖ్యమంత్రి ఆలోచనను అమలుచేసే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. క్యాన్సర్‌ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రాష్ట్రంలోనే లభ్యమయ్యేలా చూడాలన్నదే ప్రధాన లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. క్యాన్సర్‌ రోగి ఉన్నా చికిత్స కోసం పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన అని డాక్టర్ నోరి తెలిపారు. ఈ సమావేశంలో అమెరికాకు చెందిన ప్రముఖ డాక్టర్‌ అశోక్‌ కుమార్‌ కొండూరు, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.  


Also Read: AP Socio Economic Survey: ఏపీ ఆర్థిక సర్వే-రూ.31 వేలు పెరిగిన తలసరి ఆదాయం, వృద్ధి రేటులో భేష్!