Cervical Spondylosis Symptoms | ‘సర్వేకల్ స్పాండిలైటిస్’ (Cervical Spondylosis).. ఇదేంటీ కొత్త జబ్బా అని ఆశ్చర్యపోవక్కర్లేదు. ఇది ప్రతి ఒక్కరిలో వచ్చే కామన్ సమస్య. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కూడా ఈ సమస్య వచ్చింది. అయితే, ఆయనకు వచ్చిన లక్షణాలు గుండె నొప్పి సమస్యకు దగ్గరగా ఉండటంతో అంతా ఆందోళనకు గురయ్యారు. చివరికి అది ‘సర్వేకల్ స్పాండిలైటిస్’ అని తెలియగానే ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఇది అంత ప్రమాదకరమైన వ్యాధి కాదని లైట్ తీసుకోవద్దు. ఈ వ్యాధి ఒక్కసారి మొదలైతే జీవితాంతం నరకం చూపిస్తుంది. మెడ, కాళ్లు, చేతులు, నడుము, కాళ్లు విపరీతంగా లాగేస్తాయి. కోవిడ్-19, లాక్‌డౌన్ వల్ల చాలామందిలో ఇప్పటికే ఈ సమస్య మొదలైంది. కాబట్టి మీకు కూడా ఈ వ్యాధి ప్రారంభం దశలో ఉండి ఉండవచ్చు. ఇంతకీ ‘సర్వైకల్ స్పాండిలైటిస్’ అంటే ఏమిటీ? ఎందుకు వస్తుంది? లక్షణాలేమిటీ? తదితర సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 


ఇవి రెండు రకాలు: స్పాండిలోసిస్(Spondylosis), స్పాండిలైటిస్(Spondylitis).. ఈ రెండూ మీ వెన్నెముకలోని కీళ్ల సమస్య వల్ల ఏర్పడతాయి. వెన్నెముక వెన్నుపూసలతో నిండి ఉంటుంది. కీళ్లలోని ప్రతి వెన్నుపూస మధ్య ఉండే పదార్థాన్ని డిస్క్‌లు అంటారు. కీళ్ళు, డిస్క్‌లు, కాలక్రమేణా అరిగిపోవచ్చు లేదా మంట కలిగించవచ్చు. స్పాండిలైటిస్(Spondylitis) అనేది ఆర్థరైటిస్‌కు కారణమయ్యే సమస్య. స్పాండిలోసిస్(Spondylosis) అనేది వెన్నుపూస కీళ్ల అరిగిపోవడం వల్ల ఏర్పడుతుంది. ఫలితంగా డిస్క్‌లు, కీళ్లలో క్షీణత ఏర్పడుతుంది. కేసీఆర్‌కు ఏర్పడిన సమస్య స్పాండిలైటిస్. 


సర్వైకల్ స్పాండిలైటిస్ ఎందుకు వస్తుంది?: మీకు ఈ మధ్య మెడ, భుజాలు లాగుతున్నట్లుగా లేదా తిమ్మిరిగా అనిపిస్తున్నాయా? అయితే, అది సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా కావచ్చు. ఎందుకంటే.. ఆఫీసులో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఎక్కువ సేపు కూర్చొని పనిచేసేవారిలో ఈ సమస్య కనిపిస్తోంది. గత రెండేళ్లలో ఈ కేసులు బాగా పెరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ ప్రయాణాలు చేసే వ్యక్తుల్లో కూడా ఈ సమస్య ఏర్పడుతుందట. రోజూ 2 గంటల కంటే ఎక్కువ సేపు బైక్ నడిపినా ఈ సమస్య ఏర్పడుతుందట. ఎక్కువ సేపు కూర్కొని ఉండటం వల్ల మన వెన్నుముకపై ఒత్తిడి పడుతుంది. ఆ ప్రభావం మెడ వరకు పాకుతుంది. అది ‘సర్వైకల్ స్పాండిలైటిస్’కు దారితీస్తుంది. దీనివల్ల కొందరికి సూదులతో పొడుతున్నట్లుగా నొప్పి పుడుతుంది. మరికొందరికైతే మెడపై ఎవరో కూర్చున్నట్లుగా అనిపిస్తోంది. ఇలాంటి సమస్య ఏర్పడితే.. తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. అయితే, ఈ సమస్య పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. బిజీ లైఫ్ వల్ల వ్యాయామానికి సమయం కేటాయించకపోవడం, పని ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చొని పని చేయడం లేదా టీవీల్లో వెబ్ సీరిస్‌లు, మొబైల్ ఫోన్లు చూడటం తదితర కారణాల వల్ల ఇప్పుడు పురుషులు కూడా ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు. 


ఈ కారణాల వల్ల కూడా ‘సర్వైకల్ స్పాండిలైటిస్’ ఏర్పడవచ్చు.


⦿ ఎక్కువ దూరాలు డ్రైవింగ్/బైక్ రైడింగ్ చేయడం.
⦿ వెన్నె ముకకు క్షయవ్యాధి వ్యాప్తించడం. దీన్ని అంకిలైజింగ్ స్పాండిలైటిస్ అంటారు. 
⦿ అధిక బరువులను ఒకేసారి ఎత్తడం.
⦿ అతిగా బరువులు ఎత్తడం. 
⦿ వయస్సు పెరగడం వల్ల వెన్నెముక డిస్క్‌ల అరుగుదల వల్ల.
⦿ ఎక్కువ సేపు కూర్చొని ఉండటం. 
⦿ వెన్నెముకకు దెబ్బ తగలడం. 


సర్వైకల్ స్పాండిలైటిస్ లక్షణాలు: 
⦿ మెడ కండరాలు బిగిసుకుని పోతాయి. 
⦿ మెడ నొప్పి వల్ల తలను కదల్చడం కష్టం కావడం.
⦿ చేతి కండరాలు బలహీనపడతాయి. 
⦿ మెడ నుంచి భుజాలు, చేతులకు నొప్పి, తిమ్మిర్లు ఏర్పడతాయి. 
⦿ కొందరు మూత్రవిసర్జనలో నియంత్రణ కోల్పోతారు. 
⦿ కొందరికి కళ్లు తిరుగుతాయి.
⦿ భుజాలు, చేతి వేళ్ల స్పర్శ తగ్గిపోతుంది. 
⦿ నిద్రలేమి (సరిగ్గా నిద్రపట్టకపోవడం).


Also Read: ‘యాంజియోగ్రామ్’ టెస్ట్ ఎందుకు చేస్తారు? కేసీఆర్‌కు చేసిన ఈ పరీక్ష నొప్పి కలిగిస్తుందా?


వైద్యుడిని సంప్రదించండి: పై లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించిన వైద్యుడిని సంప్రదించాలి. సొంతం వైద్యం వద్దు. నిత్యం వ్యాయామం ద్వారా కూడా ‘సర్వైకల్ స్పాండిలైటిస్’ నుంచి బయటపడవచ్చు. కాబట్టి, ఇకపై ఈ లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండండి. ముదిరితే కండరాలు బలహీనమై కదల్లేని పరిస్థితి నెలకొంటుంది.


Also Read: చంకల్లో పౌడర్ పూయడం మంచిదేనా? అక్కడ నల్లగా ఎందుకు మారుతుంది?


గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు తెలిపిన వివరాలను మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.