Russia Ukraine War: ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ రష్యాపై సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యా సిరియా ఉగ్రవాదులను నియమించుకుందని ఆరోపించారు. యుద్ధంలో దెబ్బతిన్న దేశం నుంచి యోధులు తమ దళాలలో చేరడానికి అనుమతిస్తామని మాస్కో చెప్పడాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు తప్పుబట్టారు. ఉక్రెయిన్ పౌరులను హతమార్చేందుకు రష్యా కిరాయి సైనికులను నియమిస్తుందన్నారు. సిరియా నుంచి హంతకులను ఉక్రెయిన్ కు పంపి విధ్వంసం చేయాలని రష్యా చూస్తుందని జెలెన్స్కీ వీడియో ప్రకటనలో చెప్పారు.






కీలక దశలో యుద్ధం


ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా వీడియో విడుదల చేశారు. ర‌ష్యా యుద్ధంలో ఉక్రెయిన్ కీల‌క ద‌శ‌కు చేరుకుంద‌ని ఆయన అన్నారు. అయితే యుద్ధం ఎన్ని రోజులు జ‌రుగుతుందో మాత్రం చెప్పలేన‌న్నారు. ఉక్రెయిన్ స్వేచ్ఛ కోసం ఎన్ని రోజులైన పోరాడతామన్నారు. అయితే క‌చ్చితంగా స్వేచ్ఛను సాధిస్తామ‌ని జెలెన్స్కీ ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి ఓ కీల‌క ప‌రిణామ ద‌శ‌కు వ‌చ్చామ‌ని జెలెన్స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్‌లోని ప‌శ్చిమ ప్రాంతాల‌ను ర‌ష్యా తాజాగా టార్గెట్ చేసింది. దాడులు మొద‌లై 13 రోజులు గ‌డిచిన త‌ర్వాత తొలిసారిగా ఉక్రెయిన్‌ ప‌శ్చిమ ప్రాంతాల‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. ప‌శ్చిమ ప్రాంతంలోని లుస్క్‌, ఇవానో-ఫ్రాంకివిస్క్ న‌గ‌రాల‌పై మిసైల్ దాడులు చేస్తుంది. శుక్రవారం ఉద‌యం పశ్చిమ ప్రాంతంలో దాడి జ‌రిగిన‌ట్లు ఉక్రెయిన్ సైన్యం ధ్రువీకరించింది. వైమానిక కేంద్రాల‌ను మిస్సైల్స్ ద్వారా రష్యా లక్ష్యంగా చేసుకుందని ప్రకటించారు. ఈ రెండు న‌గ‌రాల‌తో పాటు డిప్రో ప్రాంతంపై మిస్సైళ్ల దాడి జరిగిందని తెలిపారు.


రష్యా ఆరోపణలు ఖండించిన జెలెన్స్కీ


ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతుంది. యుద్ధం ముగింపు కోసం చర్చలు జరుగుతున్నా రష్యా బాంబుల వర్షం కురిపిస్తుంది. ఉక్రెయిన్‌ భూభాగంలో రసాయన, జీవాయుధాలకు సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని రష్యా ఆరోపించింది. ఈ ఆరోపణలను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా ఖండించారు. తానో తండ్రినని, తమ గడ్డపై అలాంటి ఆయుధాలు ఎప్పటికీ తయారుచేయబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితులపై జెలెన్స్కీ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా రష్యా ఆరోపణలను ఖండించారు.