రష్యాలో ఉంటున్న, చదువుకుంటున్న భారత విద్యార్థుల రక్షణకు ఎలాంటి ఇబ్బంది లేదని.. వారంతా నిరభ్యంతరంగా  ఉండవచ్చని రష్యాలోని భారత ఎంబసీ స్పష్టమైన ప్రకటన చేసింది. రష్యా - ఉక్రెయిన్ యద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి విద్యార్థులు అందర్నీ సురక్షితంగా స్వదేశానికి తరలించారు.ఈ సమయంలో రష్యాలో ఉంటున్న భారత విద్యార్థులు ఇతర భారతీయులు కూడా ఆందోళన చెందుతున్నారు. తమను కూడా స్వదేశానికి తీసుకెళ్తారా..? అలా ప్లాన్లు ఏమైనా ఉన్నాయా అంటూ పెద్ద ఎత్తున ఎంబసీని సంప్రదిస్తున్నారు. దీంతో రష్యాలోని భారత ఎంబసీ అధికారులు ఓ గైడ్ లైన్స విడుదల చేశారు.


రష్యా యూనివర్సిటీల్లో చదుకుంటున్న భారతీయులు పెద్ద ఎత్తున తమను సంప్రదిస్తున్నారని రష్యాలో ఉండాలా.. ఇండియాకు వెళ్లిపోవాలా సలహా ఇవ్వాలని కోరుతున్నారని ఇండియన్ ఎంబసీ తెలిపింది. అయితే రష్యాలో ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు లేవని.. అత్యంత సురక్షితమైన పరిస్థితులు ఉన్నాయని ఎంబసీ స్పష్టం చేసింది. తక్షణం వెళ్లిపోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భారత  విద్యార్థుల రక్షణ, ఇతర విషయాల్లో రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. 


 






ప్రస్తుతం రష్యాలో బ్యాంకింగ్ వ్యవస్థలు ఇబ్బందులు ఉన్నాయని.. అలాగే నేరుగా రష్యాకు రాకపోకలు సాగించే విమానాలు లేవని ఎంబసీ తెలిపింది. అయితే తమకు రష్యాలో రక్షణ లేదని భావించే విద్యార్థులు వెళ్లిపోవచ్చని.. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని ఎంబసీ అధికారులు ప్రకటించారు. విద్యార్థుల సౌకర్యం కోసం.. ఆన్ లైన్ తరగతులు నిర్వహించాలని యూనివర్శిటీలను ఇప్పటికే సంప్రదించామని.. అనేక యూనివర్శిటీలు ఇప్పటికే ఆ మేరకు సహకరిస్తున్నాయన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆటంకాలు లేకుండా తమ చదువులపై దృష్టి పెట్టవచ్చని ఎంబసీ సూచించింది. 


రష్యాపై ఉక్రెయిన్ ఎలాంటి దాడులు చేయడం లేదు. రష్యానే ఉక్రెయిన్ పై బాంబులు వేస్తోంది. అయితే రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. అదే సమయంలో యుద్ధం ముదిరితే రష్యాలపై నాటో దాడులు చేయవచ్చన్న ఆందోళన కూడా ఉంది.  అందుకే విద్యార్థులు భయపడుతున్నారు. కానీ ఎంబసీ మాత్రం అలాంటి పరిస్థితులు లేవని నిబ్బరంగా ఉండాలని సూచిస్తోంది.  ఈ విషయంలో ఎంబసీ ఎప్పటికప్పుడు పరిస్థితులు పరిశీలిస్తూండటంతో విద్యార్థులకు కూడా టెన్షన్ తగ్గినట్లే.