Russia Ukrain Conflict: అమెరికా, బ్రిటన్ సహా పశ్చిమ దేశాల ఆంక్షల (Western Sanctions) ప్రభావం తగ్గించుకొనేందుకు రష్యా వేగంగా స్పందిస్తోంది. దాదాపుగా 200 ఉత్పత్తులను దేశం నుంచి ఎగుమతి చేయడాన్ని తాత్కాలికంగా నిషేధించింది. 'కొన్ని దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు, పనిముట్ల జాబితాను ప్రభుత్వం ఆమోదించింది. రష్యా (Russia) నుంచి ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. 2022 చివరి వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి' అని రష్యా ప్రభుత్వం మీడియాకు తెలిపింది.
రష్యా ఫెడరేషన్ భద్రత, విదేశీ ఆర్థిక వ్యవహారాల రక్షణకు ప్రత్యేక ఆర్థిక చర్యలు తీసుకొనేందుకు ప్రెసిడెన్షియల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి (Russia Ukrain conflict) దిగి 15 రోజులు దాటింది. వారిని అడ్డుకొనేందుకు అమెరికా, బ్రిటన్, ఐరోపా దేశాలు అనేక ఆంక్షలు విధిస్తున్నాయి. యాపిల్, అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, మాస్టర్ కార్డ్, వీసా సహా అనేక టెక్నాలజీ, యుటిలిటీ కంపెనీలు అక్కడ వ్యాపారాలను నిలిపివేశాయి.
రష్యా నిషేధించిన జాబితాలో దాదాపుగా 200 ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో టెక్నాలాజికల్, టెలీ కమ్యూనికేషన్, మెడికల్ ఎక్విప్‌మెంట్, వాహనాలు, వ్యవసాయ మెషినరీ, ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్, రైల్వే కార్లు, లోకో మోటివ్స్, కంటెయినర్లు, టర్బైన్లు, లోహాలు, రాతిని కట్ చేసే యంత్రాలు, వీడియో డిస్ప్లేలు, ప్రొజెక్టర్లు, గేమింగ్ కన్సోల్లు, స్విచ్ బోర్డులు ఉన్నాయి.
ఈ జాబితాలోని ఉత్పత్తులను రష్యా నుంచి ఏ దేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి లేదు. అయితే యురేషియా ఎకనామిక్ యూనియన్, అబ్కాజియా, సౌథ్ ఓసెతియాకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. 'రష్యాపై ఆంక్షలకు తర్కబద్ధమైన స్పందనే ఈ చర్యలు. దేశ ఎకానమీలోని కీలక రంగాలు నిరంతరాయంగా పనిచేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు' అని రష్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది.
రష్యా ఇంకా కఠినమైన చర్యలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. విదేశీ నౌకలను తమ నౌకాశ్రయల్లోకి రాకుండా నిషేధించడం, విదేశీ సంస్థలు రష్యా ఎయిర్‌లైన్స్ నుంచి లీజుకు తీసుకున్న విమానాలను రప్పించడం వంటివి చేయనుంది.
ఉక్రెయిన్ అధ్యక్షుడు అభ్యర్థన
రష్యా నుంచి గ్యాస్, ముడిచమురు కొనుగోలు చేయొద్దని అమెరికా, ఐరోపా దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభ్యర్థించారు. చమురు ఎగుమతులతో రష్యాకు పెద్ద ఎత్తున నగదు అందుతుందని పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావం రష్యాపై ఎక్కువగా లేదని యూఎస్ అధ్యక్షుడు బైడెన్ భావిస్తున్నారు. ఈ కారణంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా తన ఇంధన వినియోగంలో 8 శాతాని కిపైగా రష్యా నుంచి దిగుమతి చేసుకుంటుంది.
రష్యా నుంచి 3 శాతం దిగుమతులు
అమెరికా ఇంధనం, పెట్రోకెమికల్ తయారీదారులు (AFPM) ట్రేడ్ అసోసియేషన్ ప్రకారం 2021లో రోజుకు సగటున 209,000 బ్యారెల్స్ ముడి చమురును దిగుమతి చేసుకుంది. దేశం మొత్తం ముడి దిగుమతుల్లో ఇది 3 శాతం. అమెరికా తన ఇంధన సరఫరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడలేదు. యూరోపియన్ యూనియన్‌లోని సహజ వాయువులో దాదాపు 35 శాతం రష్యా నుంచి వస్తున్నందున ఐరోపా రష్యా ఇంధన సరఫరాలపై ఎక్కువ ఆధారపడుతుంది. యుఎస్ తన యూరోపియన్ మిత్రదేశాలలో చాలా మంది ఇదే విధమైన నిషేధాన్ని విధించే "స్థితిలో లేకపోవచ్చు" అని అర్థం చేసుకుంటుందని చెప్పారు. "అన్ని యూరోపియన్ దేశాల కంటే యునైటెడ్ స్టేట్స్ దేశీయంగా చాలా ఎక్కువ చమురును ఉత్పత్తి చేస్తుంది" అని యూఎస్ అధ్యక్షుడు చెప్పారు.