AP Budget 2022-23: 2,56,257 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, నాలుగు కీలకాంశాలపైనే దృష్టి పెట్టామన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. తిరువళ్లువార్ సూక్తులను గుర్తు చేసుకున్న ఆయన.. గొప్ప పాలకులు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కాపాడుతారని అదే టైంలో దేశాన్ని కాపాడుకుంటారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కరోనా టైంలో పడిన ఇబ్బంది నుంచి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను బయటపడేసేందుకు శ్రమించిందన్నారు.
మానవ సామర్థ్య అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, జీవనోపాధికి మద్దతు ఇవ్వడం, సామాజిక భద్రత అనే నాలుగు అంశాలపైనే ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు బుగ్గన. ఈ నాలుగింటిని ప్రపంచంలోని ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు ప్రామాణికంగా తీసుకున్నాయన. వీటి ఆధారంగానే మేనిఫెస్టోలో నవరత్నాలను రూపొందించామన్నారు. అందుకే నీతి యోగ్, ఎస్‌డీజీ ండియా2020-21 నివేదిక ప్రకారం, పేదరిక నిర్మూలన, స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యాన్ని పెంపొందించడం, లింగ సమానత్వం, చౌకగా సుస్థిర శక్తి వనరులను అందించడం, సముద్ర జలజీవుల పరిరక్షణ వంటి ఎస్‌డీజీలలో ఆంధ్రప్రదేశ్ మొదటి ఐదు స్థానాల్లో ఉందని గుర్తు చేశారు.
నీతి ఆయోగ్ తన ఎస్‌డీజీ నివేదికలో ఎస్‌డీజీలను అవుట్‌కమ్ బడ్జెట్ స్టేట్‌మెంట్ నమూనాతో అనుసంధానం చేయాలని సిఫార్సు చేసిందన్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలన్నా లక్ష్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు బుగ్గన. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల ద్వారా నీతి ఆయోగ్ బహుళ పేదరిక నివేదికలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థానంలో నిలిచిందన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. పేదరికం తగ్గింపులో ఐదో స్థానంలో ఉందన్నారు.
బడ్జెట్ సమగ్ర స్వరూపం
2022-23 ఆర్థిక సంవత్సరానికి 2,56, 257కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఇందులో రెవెన్యూ వ్యయం అంచా 2,08, 261 కోట్లగా పేర్కొన్నారు. మూలధన వ్యయం అంచనా 47,996 కోట్ల రూపాయలుగా చెప్పారు.
రెవెన్యూ లోటు
2022-23 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ లోటు 17,036 కోట్ల రూపాయలు ఉండబోతుందని... ద్రవ్య లోటు 48, 724 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.27శాతంగా, ద్రవ్యలోటు 3.64శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు.
వ్యవసాయం
రైతే వెన్నెముఖగా ప్రభుత్వం పని చేస్తుందన్న బుగ్గన... ఆ దిశగానే కేటాయింపులు ఉన్నాయన్నారు. 52. 40 లక్షల రైతు కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేందుకు డాక్టర్. వైఎస్ ఆర్ రైతు భరోసా- ప్రధానమంత్రి కిసాన్ యోజన కోసం 2022-23 సంవత్సరానికి 3900 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
వైఎస్‌ఆర్ ఉచిత పంటా బీమా
ఈ పథకాన్ని నీతి ఆయోగ్ ఆదర్శ నమూనాగా గుర్తించిందన్నారు బుగ్గన. వైఎస్‌ఆర్ ఉచిత పంటల బీమా కోసం 2022-23లో 1,802 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల కోసం 500 కోట్లు కేటాయించారు. వైఎస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాల కోసం18 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. వ్యవసాయ మార్కెటింగ్, ధర స్థిరీకరణ నిధి కింద ఐదు వందల కోట్లు కేటాయించారు. రైతులకు విద్యుత్ సబ్సిడీకి రూ.5 వేల కోట్లు,
పశుసంవర్థకశాఖకు 1,568.83 కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాకు 6,400 కోట్లు కేటాయించింది ప్రభుత్వం.
ప్రజాపంపిణీ వ్యవస్థ
పేదలకు పౌష్టికాహారం అందించాలన్న సంకల్పంతో స్వర్ణ, సార్టెక్స్ రకాల బియ్యాన్ని అందివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య శ్రీకి రెండు వేల కోట్లు, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకానికి మూడు వందల కోట్లు ప్రతిపాదించారు. ఆరోగ్యం వైద్యం, కుటుంబ సంక్షేమం కోసం 15, 384 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇది గత బడ్జెట్ కంటే 11.23 శాతం ఎక్కువ.
సంక్షేమానికి చేయూత
వైఎస్ఆర్ చేయూత పథకానికి 4,235.95 కోట్లు కేటాయించిన ప్రభుత్వం... వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం కోసం 800 కోట్లు ఇచ్చింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కోసం 4, 322.86 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు బుగ్గన.
వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు 18 వేల కోట్లు ప్రతిపాదించారు ఈ బడ్జెట్‌లో. వైఎస్ఆర్ బీమాకు రూ.372.12 కోట్లు ఇచ్చారు. వాహన మిత్ర కోసం రూ.260 కోట్లు, వైఎస్ఆర్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
జగనన్న తోడుకు రూ.23 కోట్లు, జగనన్న చేదోడు కోసం రూ.300 కోట్లు, ఈబీసీ నేస్తం పథకానికి రూ.590 కోట్లు, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి రూ.500 కోట్లు కేటాయించారు.
ఉప ప్రణాళికలకు కేటాయింపులు
షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక కోసం 18,518 కోట్ల రూపాయాలు, షెడ్యూల్ తెగల ఉప ప్రణాళికకు 6, 145 కోట్లు రూపాయలు, వెనుకబడి తరగతుల ఉప ప్రణాళికకు 29, 143 కోట్లు, అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ కోసం 3, 661 కోట్ల రూపాయలు ప్రతిపాదించింది ప్రభుత్వం. కాపు సంక్షేమానికి 3, 537 కోట్ల రూపాయలు కేటాయించారు.
విద్యారంగం
నీతి ఆయోగ్ 2021 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ల 2శాతం కంటే తక్కువ మంది పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే దీనికి కారణమన్నారు బుగ్గన. జగనన్న అమ్మఒడి పథకం కోసం 6,500 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు బుగ్గన. మన బడి నాడు-నేడు కార్యక్రమాల కోసం 3,500 కోట్ల రూపాయలు కేటాయించారు. పాఠశాల విద్య కోసం 27, 706.66 కోట్ల రూపాయలు కేటాయించారు. గత బడ్జెట్ కంటే 12. 52శాతం ఎక్కువ. జగనన్న విద్యా దీవెనకు 2,500 కోట్లు, జగనన్న వసతి దీవెన 2, 083. 32 కోట్ల రూపాయలు కేటాయించారు.
గృహ నిర్మాణం కోసం 4, 791. 69 కోట్ల రూపాయలను గృహ నిర్మాణ శాఖకు కేటాయించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కోసం ఐదు వేల కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధికి 15, 846. 43 ప్రతిపాదించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు 8,796.33 కోట్లు ప్రతిపాదించారు. పర్యావణం, అటవీ, శాస్త్ర సాంకేతిక రంగాల విభానికి 685. 36 కోట్ల రూపాయలు కేటాయించారు. నీటి వనరుల అభివృద్ధి 11, 482.37 కోట్ల రూపాయలు ఆమోదించారు. పారిశ్రామిక, మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2, 755. 17 కోట్ల రూపాయల కేటాయింపులు ప్రతిపాదించారు.