Breaking News Live:  జుబ్లీహిల్స్ లో బాటసారులను ఢీకొట్టిన బోధన్ ఎమ్మెల్యే వాహనం- ముగ్గురికి తీవ్రగాయాలు, చిన్నారి పరిస్థితి విషమం  

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 17 Mar 2022 09:23 PM
జుబ్లీహిల్స్ లో బాటసారులను ఢీకొట్టిన బోధన్ ఎమ్మెల్యే వాహనం- ముగ్గురికి తీవ్రగాయాలు, చిన్నారి పరిస్థితి విషమం  

 


హైదరాబాద్ జుబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఘోర ప్రమాదం జరిగింది. సిగ్నల్ వద్ద కారు రోడ్డు దాటుతున్న వారిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలవ్వగా, నెలల చిన్నారిలో చలనం లేదు. ఈ కారుపై బోధన్ ఎమ్మెల్యే స్టికర్ ఉంది. ప్రమాదం అనంతరం డ్రైవర్ పరారయ్యాడు. కారులో ఎమ్మెల్యే లేరని సమాచారం. 

 బావిలో ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు 

కడప జిల్లా ఖాజీపేట మండలం ఏటూరు వద్ద ఇతకు వెళ్లి యువకుడు గల్లంతయ్యాడు. ఐదుగురు యువకులు బావిలో ఈతకు వెళ్లారు. వీరిలో ఒకరు గల్లంతయ్యారు. యువకుని ఆచూకీ కోసం పోలీసులు గజ ఈతగాళ్లు సహాయంతో గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. గల్లంతైన యువకుడు వల్లూరు మండలం సీతా సితొర్ పల్లి గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి(18)గా గుర్తించారు. మహేశ్వర్ రెడ్డి కమలాపురంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. 

భగవద్గీత

గుజరాత్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో భగవద్గీతను తప్పనిసరి చేసింది. ఇక భగవద్గీతను ఓ సబ్జెక్ట్‌గా బోధించనున్నారు.

అంతా నా ఇష్టం

ఉక్రెయిన్‌పై దాడులు ఆపాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను రష్యా తిరస్కరించింది. ఐసీజే ఆదేశాలను తాము పాటించబోమని రష్యా తేల్చిచెప్పింది.

కేజీహెచ్ లో కిడ్నాప్ అయిన చిన్నారి సురక్షితం, శ్రీకాకుళంలో నిందితుల అరెస్టు  

విశాఖ కేజీహెచ్ చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. శ్రీకాకుళంలో చిన్నారిని సురక్షింతంగా పోలీసులు పట్టుకున్నారు. నిమ్మాడ జంక్షన్ వద్ద నిందితులను పట్టుకుని చిన్నారిని రక్షించారు.  

గిరిజనులతో కలిసి హోలీ ఆడిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో కడవెండి - పొట్టిగుట్ట శివారులోని వానకొండయ్య శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యేందుకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో లంబాడా గిరిజన మహిళలు హోలీ ఆడుతూ కనిపించారు. వారిని చూసిన మంత్రి తన వాహనాన్ని ఆపి, వారిని పలకరించారు. మంత్రితో కలిసిపోయిన లంబాడ గిరిజన మహిళలు ఆయనకు బొట్లు పెడుతూ తమతోపాటు హోలీ అలాగే కోలాటం ఆడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వారి కోరికను మన్నించిన మంత్రి వారితో కొద్దిసేపు చప్పట్లు కొడుతూ, మరి కొద్దిసేపు కోలాటం ఆడి, అక్కడున్న వాళ్ళందరిని ఆనందపరిచారు.

RRR సినిమా టీమ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్

దేశంలోనే మోస్ట్ వెయిటెడ్ సినిమాగా ఉన్న RRR చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆ సినిమా విషయంలో టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతిస్తున్నట్లుగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. RRR సినిమాకు రూ.336 కోట్లు ఖర్చు అయినట్లుగా చిత్ర టీమ్ దరఖాస్తులో పేర్కొందని వెల్లడించారు. ఆ మేరకు టీడీఎస్, జీఎస్టీ కూడా వారు చెల్లించారని వెల్లడించారు. RRR సినిమా విడుదల తర్వాత 10 రోజుల వరకూ టికెట్ రేట్లు పెంచుకొనేందుకు అనుమతించినట్లుగా వెల్లడించారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌

ఏపీ శాసన సభ నుంచి టీడీపీ సభ్యులు నేడు కూడా సస్పెన్షన్‌‌కు గురయ్యారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడంతో ఒక రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెన్షన్‌ చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకున్నారు. సత్యప్రసాద్‌, చినరాజప్ప, రామ్మోహన్‌, అశోక్‌, సాంబశివరావు, గొట్టిపాటి రవి, రామరాజు, గణబాబు, భవానీ, జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణలను స్పీకర్ సస్పెండ్ చేశారు. వారు తక్షణం సభ నుంచి బయటికి వెళ్లాలని ఆదేశించారు.

సభలోనే చప్పట్లు కొట్టిన టీడీపీ సభ్యులు

ఏపీలో జే బ్రాండ్స్ మద్యం, నాటు సారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయిన సమయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు టీడీపీ సభ్యులు సభలోనే చప్పట్లు కొట్టారు. తమ గోడు వినిపించుకోవడం లేదంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు కొట్టారు. ఇలా చప్పట్లు కొట్టడం ఏంటని స్పీకర్ తమ్మినేని సీతారం అభ్యంతరం తెలిపారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ ప్రారంభం

ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే తొలుత ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సమయంలోనే సభా కార్యక్రమాలకు టీడీపీ సభ్యులు నేడు కూడా అడ్డు తగిలారు. సభను అడ్డుకోవడం టీడీపీకి ప్రతిరోజూ అలవాటుగా మారిందని స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.

Background

ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రంలో రాగల రెండు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


‘‘మహా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో మార్చి 15 సాయంత్రం అల్ప పీడనం ఏర్పడింది. ఇది మార్చి 16న దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఉంది. ఇది తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దాని చుట్టూ ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతూ 19వ తేదీ ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇది మొదట్లో ఉత్తర వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. మార్చి 22 వరకూ ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదిలి, మార్చి 23 ఉదయం నాటికి బంగ్లాదేశ్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర మయన్మార్ తీరానికి చేరుకుంటుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి గాలులు వీస్తున్నాయి.


వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల మూడు రోజుల వరకూ వాతావరణ సూచన ఇలా ఉండనుంది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగానే ఉంటుంది.’’ అని అమరావతి వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. 


‘‘కోస్తాంధ్ర​, తూర్పు తెలంగాణ​, ఉత్తర తెలంగాణలో వడగాల్పులు విపరీతంగా ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల్లో 43 డిగ్రీల దాక ఉష్ణోగ్రతలు వెళ్తున్నాయి. వేడి విపరీతంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఖమ్మం, సూర్యాపేట​, నల్గొండ జిల్లాల మీదుగా ఉంది. మరో రెండు గంటలపాటు ఈ తీవ్రత కొనసగుతుంది. హైదరాబాద్ లో కూడ 39 డిగ్రీలు నమోదవుతోంది ప్రస్తుతం. దయజేసి ఇంట్లో ఉండటం, ఒక చల్లటి ప్రదేశంలో ఉండటం మంచిది. నీరు ఎప్పటికప్పుడు తాగుతూ ఉండండి.’’ అని ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ సూచించారు.


తెలంగాణలో ఇలా.. (Telangana Weather Update)
తెలంగాణలోని ఖమ్మం, సూర్యాపేట​, భద్రాద్రి కొత్తగూడం జిల్లాల్లో ఎండ వేడి ఎక్కువగా ఉండనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా మారుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నాయి. ఆగ్నేయ దిశ నుంచి గంటలకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీలు దాటుతున్నాయి. బుధవారం అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఏకంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ అధికారులు వెల్లడించారు.


బంగారం, వెండి ధరలు
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా మూడో రోజు నేడు (Todays Gold Rate) తగ్గింది. గ్రాముకు నేడు రూ.50 తగ్గింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరిగిన సంగతి తెలిసిందే. వెండి ధర కూడా నేడు కిలోకు రూ.500 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్‌ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.51,600 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.72,300 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.


ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.72,300 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.47,300 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.51,600గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.72,300 గా ఉంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.