Locals Obstructed AP Ministers in Dommeru: తూ.గో జిల్లా కొవ్వూరు (Kovvuru) మండలం దొమ్మేరు (Domeeru)లో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లెక్సీ వివాదంలో పోలీసులు తనను వేధించారనే మనస్తాపంతో ఎస్సీ యువకుడు మహేంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు హోం మంత్రి తానేటి వనిత (Thaneti Vanitha), సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున (Meruga Nagarjuna), కలెక్టర్, డీఐజీ గ్రామానికి రాగా, స్థానికులు, మృతుడి స్నేహితులు, కుటుంబ సభ్యులు వారిని అడ్డుకున్నారు. ఘటనకు స్థానిక వైసీపీ నేతలు, పోలీసులే కారణమని ఆరోపించారు. ఘటనకు హోంమంత్రి బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ గ్రామస్థులు తీవ్రంగా ప్రతిఘటించడంతో, దాదాపు అరగంట పాటు మంత్రులు గ్రామం వెలుపలే వేచి ఉండాల్సి వచ్చింది. గ్రామస్థులు, పోలీసుల మధ్య తోపులాట జరగ్గా, ఆందోళనకారులను చెదరగొట్టారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
కొద్దిసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగిన అనంతరం మంత్రులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి మేరుగ నాగార్జున రూ.10 లక్షలు చెక్కును వారికి అందజేశారు. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ కృష్ణ రూ.10 లక్షలు అందజేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని, ఘటనకు కారణమైన వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ జరిగింది
తూ.గో జిల్లా దొమ్మేరులో వైసీపీకి చందిన ఓ ఫ్లెక్సీ చిరిగిపోయిన వివాదంలో, ఎస్సీ యువకుడు మహేంద్రను పొలం పనులు చేసుకుంటున్న సమయంలో పోలీసులు తీసుకెళ్లారు. తనకు ఈ వివాదంతో సంబంధం లేదని చెప్పినా, సాయంత్రం వరకూ స్టేషన్ లోనే ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మహేంద్ర పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానిక ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, మహేంద్ర బుధవారం రాత్రి మృతి చెందాడు. దీంతో యువకుడు మృతదేహాన్ని పోలీసులు తెల్లవారుజామున దొమ్మేరు తీసుకురాగా, స్థానికులు నిరసన తెలిపారు. పోలీసుల తీరు వల్లే ఇలా జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిపై రాళ్లు, సీసాలతో దాడికి దిగారు. ఈ క్రమంలో ఏఎస్సైకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్యే అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతుడి కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు, జనసేన నాయకులు, ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.