Andhra News : ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మెడికల్ రిపోర్ట్సును ఆయన లాయర్లు హైకోర్టుకు సమర్పించారు. అందులో ఆయనకు గుండె సమస్య ఉందని నివేదిక ఉండటంపై ఏపీ ప్రభుత్వం ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ పై తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద మరింతకాలం ఉండడానికి వీలుగా మెడికల్ రిపోర్టు ఇచ్చినట్టుందన్నారు. ఏఐజీ ఆసుపత్రి రిపోర్టు చూస్తే వైద్యులా, పొలిటికల్ డాక్టర్లా అన్నట్టు కనిపిస్తుందని సజ్జల దుయ్యబట్టారు. పబ్లిక్ లైఫ్‌లో ఉంటారు కనుక ఒక అంబులెన్స్ ఉండాలి అని ఇవ్వడం చూస్తే అర్థం అవుతుందన్నారు. చాలా క్యాజువల్‌గా రిపోర్టు ఇచ్చారన్నారు.
అరెస్ట్ కాకముందు సభల్లో... వయసు తనకో సమస్య కాదన్న చంద్రబాబు... అరెస్టయ్యాక వయసు, వ్యాధులను ప్రస్తావించడాన్ని ఏమనాలని సజ్జల ప్రశ్నించారు. చర్మ వ్యాధులను ప్రాణాంతక వ్యాధులన్నట్టు ప్రచారం చేశారన్నారు. పొలిటికల్ లైఫ్ గురించి డాక్టర్లు మాట్లాడటం చూస్తే కామెంట్ చేయక తప్పదన్నారు. కోర్టు వైద్యం చేయించుకోమని బెయిల్ ఇస్తే.. అంబులెన్స్‌తో బయట తిరగమని డాక్టర్లే చెపుతున్నారన్నారు. చంద్రబాబు జైల్లో ఉండాలని మేమేం కోరుకోవట్లేదని.. చంద్రబాబు లోపల ఉంటే మాకేం లాభం లేదన్నారు. చంద్రబాబు బయటకి వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు చేసిన స్కాం ఈ వంకలతో పక్కకి పోతోందన్నారు. పొలిటికల్ అవసరానికి సూడో మెడికల్ వ్యవహారం చేస్తున్నారని అందరూ గమనించాలని సజ్జల కోరారు.
కంటికి ఆపరేషన్ చేయించుకున్న తర్వాత రాజకీయ సమావేశాలు పెడుతున్నారని సజ్జల ఆరోపించారు. కంటికి శస్త్రచికిత్స చేయించుకునేందుకు బెయిల్ పొంది రాజకీయ భేటీలు నిర్వహించారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ వచ్చుంటే ఆయన ఏం చేసినా మేం అడగం. ఇప్పుడు కంటికి శస్త్రచికిత్స చేయకపోతే కళ్లు పోతాయని, చర్మవ్యాధులకు చికిత్స చేయకపోతే గుండె ఆగిపోతుందన్నట్టు నానా యాగీ చేసి బెయిల్ తెచ్చుకున్నారు" అంటూ సజ్జల విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఓపెన్‌గా టీడీపీ తమతో ఉందని చెపుతున్నారని.. ఒకేసారి ఎంతమందితో సంసారం చేస్తారని విమర్శలు గుప్పించారు.
పురంధేశ్వరి చంద్రబాబు అజెండా మాట్లాడుతుందని ఆయన ఆరోపించారు. చంద్రబాబు, పవన్‌కి ఉన్నది ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయగలమనే బరితెగింపు మాత్రమేనన్నారు. ప్రభుత్వం, జగన్‌లపై ఆరోపణలు చేస్తే వాటిపై ప్రశ్నలకు సమాధానం చెప్పక్కర్లేదనే బరితెగింపు అని ఆరోపించారు. ఇలాంటివి చూసినప్పుడు సహజంగానే ఏదో ఒకటి అంటారు. ఏదైనా అంటే మాత్రం బుద్ధుడు అంతటివాడ్ని పట్టుకుని మాటలు అంటారా అని కోపాలు వస్తాయని సజ్జల వెటకారం చేశారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టో కమిటీ భేటీపైనా సజ్జల విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టో కోసం రెండు దేశాల అగ్రనాయకులు లాగా కూర్చున్నారని విమర్శించారు. ప్రజలకు చెవుల్లో క్యాలిఫ్లవర్ పెడుతున్నారా మీ మేనిఫెస్టోతో అంటూ ఎద్దేవా చేశారు.