CM Jagan Distributed Land Title Deeds in Nuzivid: రాష్ట్రంలో భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ, రికార్డులు అప్ డేట్ చేస్తున్నామని సీఎం జగన్ (CM Jagan) తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో (Nuzivid) భూ యాజమాన్య హక్కుల పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు (DKT Pattas) పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడం సహా అసైన్డ్ భూములకు (Assigned Lands) యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు సైతం అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూ కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీని సీఎం చేపట్టారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. సామాజిక న్యాయాన్ని ఓ విధానంలా అమలు చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు.
వేగంగా సర్వే
రాష్ట్రంలో భూతగాదాలు పరిష్కారమయ్యేలా వేల మంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేయిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. 'మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండో దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. మొత్తంగా 45 లక్షల ఎకరాల సరిహద్దు అంశాలు పరిష్కరించాం. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తైంది. ఆయా గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం. లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాం' అని వివరించారు.
చంద్రబాబుపై విమర్శలు
టీడీపీ హయాంలో అన్ని వర్గాలను మోసం చేశారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడీయే జరిగందని మండిపడ్డారు. ఆయన ప్రజలకు మంచి చేసి ఎప్పుడూ సీఎం కాలేదని, తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. సామాజిక వర్గాలపై చంద్రబాబు అభిప్రాయాన్ని ప్రజలంతా గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే ధైర్యం చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.
'ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని, ఈ సమయంలో తోడేళ్లంతా ఏకమవుతున్నాయని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై, ప్రతి ఇంటికీ బెంజ్ కారు ఇస్తాం వంటి హామీలిస్తారని, వాటిని నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014లో ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదని, చంద్రబాబుకు మేనిఫెస్టోపై కమిట్మెంట్ లేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే ఇచ్చామని జగన్ వివరించారు. అభివృద్ధి, సంక్షేమం చూసి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ప్రజా దీవెనలతో తాము ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
Also Read: SI Recruitment: ఏపీలో ఎస్ఐ నియామకాలపై 'స్టే', అర్హతలపై పోలీసు బోర్డును ప్రశ్నించిన హైకోర్టు