AP Highcourt Stay on Police SI Notification: ఏపీలో ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఎత్తు అంశంలో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని.. గతంలో అర్హులైన వారిని, ప్రస్తుతం అనర్హులుగా ప్రకటించారని పిటిషన్ వేశారు. బాధితుల తరఫున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. గతంలో అర్హులైన వారు ప్రస్తుతం అనర్హులు ఎలా అవుతారని పోలీసు నియామక బోర్డును హైకోర్టు ప్రశ్నంచింది. నియామక ప్రక్రియను నిలుపుదల చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఆ వాదనలతో ఏకీభవించి ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐ నోటిఫికేషన్‌పై స్టే విధించింది.


ఎస్‌ఐ నియామక ప్రక్రియలో ఛాతీ, ఎత్తు డిజిటల్‌ మీటర్‌ ద్వారా లెక్కించడంతో అనర్హులయ్యామని పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డిజిటల్‌గా కాకుండా మాన్యువల్‌గానే ఫిజికల్ పరీక్షలు నిర్వహించేలా పోలీసు నియామక బోర్డును ఆదేశించాలని వారు కోర్టును కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.సుజాత అక్టోబర్‌ 12న విచారణ జరిపారు. విచారణలో భాగంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల మంది ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలకు హాజరయ్యారని.. వారిలో సరిపడా ఎత్తు లేరనే కారణంగా 5 వేల మందిని తిరస్కరించారని పిటిషనర్ల తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌ కోర్టుకు తెలిపారు.


నియామకాల్లో తిరస్కరణకు గురైన అభ్యర్థులందరూ 2019లో క్వాలిఫై అయినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో.. 2019లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఇప్పుడెందుకు తిరస్కరణకు గురయ్యారని ధర్మాసనం ప్రశ్నించింది. 2019లో నిర్వహించిన పరీక్షల్లో ఎత్తు విషయంలో అర్హత సాధించిన పిటిషనర్లు ప్రస్తుతం డిజిటల్‌ మీటర్‌ను వినియోగించడంతో అనర్హులయ్యారన్నారు. ప్రతి అభ్యర్థి విషయంలో చర్యలు తీసుకున్నామని ప్రభుత్వ తరఫు న్యాయవాది అప్పుడు పేర్కొన్నారు. అక్టోబరు 14, 15 తేదీల్లో జరిగే మెయిన్స్‌ను తాత్కాలికంగా వాయిదా వేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పిదాల వల్ల నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరారు. నిబంధనల మేరకే వ్యవహరించామని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. 


ఏపీలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (సివిల్‌) పోస్టులకు (పురుషులు, మహిళలు), రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ (పురుషులు) పోస్టులకు సంబంధించి 411 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఎస్‌ఐ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాతపరీక్షకు మొత్తం 1,51,288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57,923 మంది అభ్యర్థులు (38 శాతం) ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించారు. వీరిలో 49,386 మంది పురుషులు, 8537 మహిళలు ఉన్నారు.


ఫిజికల్ ఈవెంట్లలో అర్హత సాధించిన 31,193 మంది అభ్యర్థులకు అక్టోబరు 14, 15 తేదీల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించారు. అక్టోబర్‌ 14 నిర్వహించిన పేపర్‌-1 (ఇంగ్లిష్‌), పేపర్‌-2 (తెలుగు) పరీక్షలకు 30,585 మంది హాజరయ్యారు. మొత్తం 608 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. ఇక రెండో రోజైన అక్టోబర్‌ 15 జరిగిన పేపర్‌-3 (అరిథ్‌మెటిక్‌, మెంటల్‌ ఎబిలిటీ) పరీక్షకు 30569 మంది, పేపర్‌-4(జనరల్‌ స్టడీస్‌) పరీక్షకు 30560 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని అక్టోబరు 15న పోలీసు నియామక మండలి విడుదల చేసింది. ఆన్సర్ కీపై అక్టోబరు 18 వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఫైనల్ కీతోపాటు మెయిన్ పరీక్షల ఫలితాలను వెల్లడించాల్సి ఉంది.