Kulgam Encounter: 


కుల్గాం జిల్లాలో ఎన్‌కౌంటర్..


జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆర్మీ, ఉగ్రవాదుల (Jammu and Kashmir News) మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీళ్లలో ముగ్గురు ఉగ్రవాదులు లష్కరే తోయిబా సంస్థకు చెందిన వాళ్లేనని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతోంది. ఆర్మీతో పాటు పారామిలిటరీ బలగాలూ ఈ స్పెషల్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. పోలీసులు, CRPF బలగాలూ సాయం అందిస్తున్నాయి. ఉగ్రవాదులు పలు చోట్ల దాక్కుని దాడులకు పాల్పడుతున్నారు. నిఘా వర్గాల సమాచారంతో ఆ ప్రాంతాలన్నింటినీ జల్లెడ పట్టింది ఇండియన్ ఆర్మీ. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్ జరిగింది. కులగాం జిల్లాలోని సామ్నూ ప్రాంతంలో ఆర్మీ, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. 






ఈ ఎన్‌కౌంటర్‌పై కశ్మీర్ IGP విధి కుమార్ స్పందించారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగానే సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టినట్టు వెల్లడించారు.


"భద్రతా బలగాలకు నిఘా వర్గాల సమాచారం అందింది. కుల్గాం జిల్లాలోని ఉగ్రకదలికల్ని గుర్తించారు. ఈ సమాచారం ఆధారంగానే సెర్చ్ ఆపరేషన్‌ చేపట్టాం. ఈ క్రమంలోనే ఓ ఇంట్లో నుంచి ఉగ్రవాది కాల్పులు జరిపాడు. మేమూ ఎదురు కాల్పులు జరిపాం. ఈ ఎన్‌కౌంటర్‌లో 5గురు ఉగ్రవాదులు హతమయ్యారు"


- విధి కుమార్, కశ్మీర్ IGP






Line of Control (LoC) వద్ద ఓ ఉగ్రవాది భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చేందుకు ప్రయత్నించాడు. వెంటనే పసిగట్టిన భారత సైనికులు కట్టడి చేశారు. ఉరి సెక్టార్‌లో ఇలా తరచూ ఉగ్రవాదులు LOCని దాటి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. ఇలా ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని హతమార్చినట్టు ఆర్మీ వెల్లడించింది.