Madhya Pradesh Election 2023:



కొనసాగుతున్న పోలింగ్..


మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఇవాళ (నవంబర్ 17) పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యప్రదేశ్‌లో 230 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ పూర్తి కానుంది. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే ఓ విడత ఎన్నికలు పూర్తయ్యాయి. నవంబర్ 7వ తేదీన మొదటి విడత పూర్తికాగా ఇవాళ రెండో విడత పోలింగ్ జరుగుతోంది. మొత్తం 70 స్థానాల్లో 958 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అటు మధ్యప్రదేశ్‌లో 230 నియోజకవర్గాల్లో 2 వేల మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్ బరిలో ఉండడం ఆసక్తికరంగా మారింది. ఛత్తీస్‌గఢ్ పటాన్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్‌ పార్టీల మధ్య త్రిముఖ పోరు జరగనుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్...మేనల్లుడు, బీజేపీ నేత విజయ్ భగేల్‌తో తలపడనున్నారు. ఇప్పటికే కమల్‌నాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీ అవినీతి పాలనతో విసిగిపోయారని మండిపడ్డారు. ఈ సారి ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారన్న నమ్మకముందని వెల్లడించారు. ఉదయం 9 గంటల నాటికి ఛత్తీస్‌గఢ్‌లో 5.71% పోలింగ్‌ జరగ్గా...మధ్యప్రదేశ్‌లో 11.13% పోలింగ్ నమోదైంది. వాళ్ల భవిష్యత్‌ భద్రంగా ఉండాలంటే కాంగ్రెస్‌ని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఓట్ల కోసం బీజేపీ పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేసిందని ఆరోపించారు. ఓటు వేసిన తరవాత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఎన్నికలపై అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని, పిల్లలు, యువతతో పాటు వృద్ధుల నుంచీ తమ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోందని స్పష్టం చేశారు. 






మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఓటు వేసే ముందు ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. మహిళా ఓటర్లందరికీ చౌహాన్ సతీమణి స్వీట్లు పంచారు. అయితే...మధ్యప్రదేశ్‌లో మొరెనా జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. ఓటింగ్‌లో రిగ్గింగ్‌కి పాల్పడాలని చూసిన కొందరు ఉన్నట్టుండి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసుల రాకతో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.