వాయుగుండం ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటి తీవ్ర అల్ప పీడనంగా ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాలైన ఉత్తర తమిళనాడు రాయలసీమ మీద అల్పపీడనంగా బలహీనపడిందని పేర్కొంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటను 5.5 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణ కర్ణాటక పరిసర ప్రాంతాల మీదగా కొనసాగుతున్నదని వెల్లడించింది. ఈ ఉపరితల ఆవర్తనం నుంచి అల్పపీడన ద్రోణి ఉత్తర తమిళనాడు, రాయలసీమ కోస్తాంధ్ర మీదగా దక్షిణ ఒడిశా వరకు 1.5 కిలోమీటర్లు ఎత్తులో కొనసాగి బలహీనపడిందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఉత్తర కోస్తాంధ్ర-యానాం:
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: కదిరిలో కూలిన భవనాలు.. ఆరుగురు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది
దక్షిణ కోస్తాంధ్ర :
ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. రేపు కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Also Read: ప్రాణాలు కాపాడేందుకు వచ్చి.. విగత జీవిగా మారిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్
రాయలసీమ:
ఇవాళ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని వెల్లడించింది. రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని తెలిపింది.
Also Read: భారీ వర్షాలకు పోటెత్తిన పాపాగ్ని నది... కుంగిపోయిన కడప-కమలాపురం వంతెన
తెలంగాణలో వర్షాలు
ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండగా తెలంగాణలో రాబోయే మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కోస్తాంధ్రా మీదగా ఒడిశా వరకు ఉపరితల ద్రోణి శనివారం బలహీనపడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ తెలిపారు. తెలంగాణలో కింది స్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిక్కుల నుంచి వీస్తున్నట్లు పేర్కొన్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో జల విలయం కొనసాగుతుండగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో శనివారం పలు ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షం కురిసింది. నాంపల్లి, బషీర్ బాగ్, బేగంబజార్, కోఠి, అబిడ్స్, హిమాయత్ నగర్, లిబర్టీ, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. రాబోయే మూడు రోజులు వర్షాలు పడుతాయన్న హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు.