ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలకు తీవ్ర ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఈ నష్టంపై ఏపీ ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు ప్రకటించింది. చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లోని 172 మండలాలపై వర్షాల ప్రభావం పడిందని వెల్లడించింది. చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొంది. వర్షాలు, వరదలతో ఇప్పటివరకు 24 మంది మృతిచెందారని తెలిపింది. మరో 17 మంది గల్లంతైనట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నాలుగు జిల్లాల్లో 23,345 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని తెలిపింది. 19,644 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. వరదలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ₹7 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 



Also Read: భారీ వర్షాలకు పోటెత్తిన పాపాగ్ని నది... కుంగిపోయిన కడప-కమలాపురం వంతెన


టీటీడీకి రూ.4 కోట్ల నష్టం


నవంబరు 17 నుంచి 19 వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 ఏళ్లలో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. భారీ వర్షాల వల్ల తిరుమలలో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ  భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయని తెలిపారు. మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్డులో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టీటీడీ సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలగించి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్‌ను పునరుద్ధరించారని పేర్కొన్నారు. రెండవ ఘాట్ రోడ్డులో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయని... ఐదు ప్రాంతాల్లో రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు. 



Also Read: ప్రాణాలు కాపాడేందుకు వచ్చి.. విగత జీవిగా మారిన ఎన్డీఆర్ఎఫ్ కానిస్టేబుల్ 


తూర్పుగోదావరి జిల్లాలో భారీగా పంట నష్టం


తూర్పుగోదావరి జిల్లాలో వాయుగుండం ప్రభావంతో కుండపోతగా కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా వరి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. ఆరుగాలం శ్రమించిన  రైతులు కళ్లముందే ముంపునకు గురైన చేలల్లో కుళ్లిపోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. పంట చేతి కందుతుందన్న దశలో వరద ముంచెత్తిందని రైతులు తీవ్ర ఉద్వేగానికి గురవుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పలు కాలనీలు, వరి చేలు పూర్తిగా నీట మునిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్ లో 5.69 లక్షల ఎకరాల్లో వరి వేయగా ఇప్పటివరకు 35 వేల ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. కుండపోత వర్షాలకు 2.63 లక్షల ఎకరాల్లో వరి పంట ముంపునకు గురై నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 23 వేల ఎకరాల వరకు పూర్తిగా పంట నష్టం వాటిల్లిందని చెబుతున్నారు.  ఇప్పటికే పలు చేలల్లో నాలుగు రోజులుగా నానుతున్న వరి పంటలు కుళ్లిపోయే స్థితిలో ఉన్నాయి. కల్లాల్లోనే ఉన్న ధాన్యం మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. 


Also Read: కదిరిలో కూలిన భవనాలు.. ఆరుగురు మృతి.. శిథిలాల్లో మరికొంత మంది


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి