వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కళాకారులు, వృత్తి కార్మికుల జీవనాధారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెలా ‘వైఎస్సార్ పెన్షన్ కానుక’ కింద ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అయితే మూడు నెలలుగా పింఛన్ల పంపిణీని గమనించిన ప్రభుత్వం.. అనర్హులు లబ్ధి పొందుతున్నారని భావించింది. అందుకే అనర్హులను వైఎస్సార్ పెన్షన్ కానుక జాబితాలో నుంచి ఏరివేయాలని నిర్ణయించింది. తలచిందే తడవుగా, పూటకొక్క నిబంధనతో పింఛన్ లబ్ధిదారుల ఏరివేతను మొదలు పెట్టింది. అనంతపురం జిల్లాలో ఆగస్టు 1తో పోలిస్తే.. సెప్టెంబర్ 1 నాటికి 20 వేలకు పైగా పింఛన్లను ప్రభుత్వం రద్దు చేసింది. తద్వారా సుమారు రూ.13 కోట్ల మొత్తాన్ని మిగుల్చుకుంది. 
దీంతో వచ్చే నెల 1వ తేదీకి తమకు పింఛన్ అందుతుందా..? తమ ఆహారం, వైద్య అవసరాలు తీరతాయా..? లేక ఏదో ఓ కారణం చెప్పి ప్రభుత్వం తమ పింఛన్లను రద్దు చేసేస్తుందా..? అనే ఆలోచనలు లబ్ధిదారుల్లో గుబులు రేపుతున్నాయి. పింఛన్ల తొలగింపు కార్యక్రమం వల్ల అందరికన్నా ఎక్కువగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. 
ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో తొలగించిన ఫించన్ల వివరాలు పట్టిక - 1లో చూడవచ్చు.

పట్టిక - 1

జిల్లా: అనంతపురం మొత్తం పెన్షన్లు చెల్లించిన మొత్తం (రూ.కోట్లలో)
01-08-2021 నాటికి 5,18,574 126.693   
01-09-2021 నాటికి 4,98,224 113.801
తొలగించినవి   20,350     12.892 (ఆదా)

పింఛన్లను తొలగించడంలో అధికారులు ఏ కేటగిరీనీ వదల్లేదు. తొలగించిన వాటిలో, వితంతువులు,
ఒంటరి మహిళల పింఛన్లే ఎక్కువగా ఉన్నాయి. (పట్టిక-2లో వివరాలు చూడొచ్చు) 

పట్టిక - 2

  వితంతు పింఛన్లు ఒంటరి మహిళల పింఛన్లు
01-08-2021 నాటికి   1,66,094   13,622
01-09-2021 నాటికి   92,937   13,308
తొలగించినవి      73,157        314

ట్రాన్స్‌జెండర్లు, కళాకారుల పింఛన్లనూ తీసేశారు. బియ్యం కార్డులో వితంతు, ఒంటరి మహిళలకు సంబంధించి భర్త పేరు ఉండటం.. భర్త స్థానంలో కుమారుడి పేరు నమోదవ్వడం.. ఈకేవైసీలో జెండర్ తప్పుగా నమోదవడం లాంటి కారణాలను చూపి వీరి పింఛన్లను తొలగించారు. 

Also Read: CM Jagan Review : డిసెంబర్ నుంచి గ్రామ సచివాలయాల తనిఖీ.. సీఎం జగన్ కీలక నిర్ణయం

లబ్ధిదారుల ఏరివేత ఇలా..

  • ఒక రేషన్‌ కార్డుకి ఒకే పింఛన్
  • ఆధార్‌ అనుంధానం ద్వారా లబ్ధిదారుల వయసు గుర్తింపు
  • ఆరు నెలల కాల వ్యవధిలో.. ఏ నెల అయినా 300 యూనిట్లకు మించి విద్యుత్ వినియోగించరాదు
  • ఏ నెల పింఛన్ ఆ నెలే తీసుకోకపోతే, పింఛన్ వాపస్
  • పది ఎకరాలకన్నా ఎక్కువ పొలం ఉంటే పింఛన్ కట్ 
  • కుటుంబ సభ్యుల్లో ఎవరు ఆదాయ పన్ను చెల్లిస్తున్నా పెన్షన్ కట్

Also Read: TTD High Court : 50 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు

వివరాలను సేకరించి అనర్హత నోటీసులు..
ప్రభుత్వ నియమావళికి అనుగుణంగా గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్ధిదారుల వ్యక్తిగత/కుటుంబ వివరాలను సేకరించి, అనర్హత నోటీసులు అందిస్తున్నారు. అయితే పింఛన్‌ల తొలగింపే తప్ప, వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం లేదని లబ్ధిదారుల వాపోతున్నారు. అనంతపురం జిల్లా కరవుకు చిరునామా. ఇక్కడి పేదలు, వృద్ధులను ఇళ్ల వద్ద వదిలేసి, మిగతా వారు కూలి పనుల కోసం సుదూర ప్రాంతాలకు తరలి వెళ్తుంటారు. రెండు మూడు నెలలకోసారి ఊరికి వస్తుంటారు. ప్రభుత్వ నిబంధనల కారణంగా వీరు పింఛన్ కోల్పోతున్నారు. జిల్లాలో చాలామంది ఉన్నతోద్యోగాలు రాగానే, తల్లిదండ్రులను విస్మరించి వెళ్లిపోతున్నారు. ఇలాంటి తల్లిదండ్రులు ప్రభుత్వం చెల్లించే పింఛన్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. సంతానానికి ఆదాయం ఉందని, పన్ను కూడా చెల్లిస్తున్నారు కాబట్టి, ఆ వృద్ధులకు పింఛన్ తొలగిస్తామని ప్రభుత్వం అంటోంది. 

రాతపూర్వక వివరణ ఇవ్వాలి.. 
ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకున్న లబ్ధిదారులు, తాము పింఛన్‌ పొందేందుకు అర్హులేనని రుజువు చేసుకునే పత్రాలతో రాతపూర్వక వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుంటే పింఛన్ శాశ్వతంగా రద్దయిపోతుంది. కరవుకు తోడు నిరక్షరాస్యత అధికంగా వుండే అనంతపురం జిల్లాలో ఈ తంతు గురించి  తెలియని ఎందరో అమాయకులు పింఛన్లను కోల్పోతున్నారు. దీంతో తమకు పింఛన్ ఉంటుందో.. ఊడుతుందో తెలియని అయోమయ స్థితిలో వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులు ఉన్నారు.

Also Read: TTD Guidelines: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సర్టిఫికేట్ ఉంటేనే దర్శనం.. కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చిన టీటీడీ

Also Read: AP New Law : చిన్నారులపై వేధింపులను అరికట్టేందుకు పోక్సోను మించిన చట్టం ! ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ కీలక ప్రకటన

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి