ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్ లేదా మూడు రోజుల ముందు వచ్చిన కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తేవాలని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు. కొవిడ్ నియంత్రణ కోసమే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తాని సుబ్బారెడ్డి చెప్పారు. సెప్టెంబరు 26వ తేదీ నుంచి అక్టోబరు 31వ తేదీ దాకా రోజుకు ఎనిమిది వేల చొప్పున ఎస్డీ టోకెన్లు ఆన్లైన్లో విడుదల చేస్తామన్నారు.
26వ తేదీ నుంచి తిరుపతిలో ఆఫ్ లైన్లో జారీ చేసే ఎస్డీ టోకెన్లను నిలిపి వేస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అక్టోబరు మాసం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఎల్లుండి ఉదయం 9 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తామని తెలిపారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7 నుంచి 15వ తేదీ వరకు ఏకాంతంగా నిర్వహించనున్నారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాటుపై ఈఓ సమీక్ష చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లు ప్రారంభించేందుకు సీఈఓ ఏర్పాట్లు చేపట్టాలని ఈవో జవహర్ రెడ్డి అన్నారు. వాహన సేవల వైశిష్ట్యంపై వసంత మండపంలో ప్రముఖ పండితులతో ఉపన్యాస కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని.. చెప్పారు.
బ్రహ్మోత్సవాల ఏర్పాటు సంబంధించిన ఇంజినీరింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఈవో ఆదేశించారు. అలిపిరి కాలినడక మార్గాన్ని బ్రహ్మోత్సవాల లోపు.. భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు. విశ్రాంతి గదుల్లో మాస్ క్లీనింగ్ చేపట్టాలని, మరమ్మతులు పూర్తయిన కాటేజీలను భక్తులకు కేటాయించేందుకు సిద్ధంగా ఉంచుకోవాలని జవహర్ రెడ్డి సూచించారు.
వాహనసేవలు జరిగే ప్రాంతమైన ఆలయంలోని కల్యాణమండపంలో చిన్న బ్రహ్మరథం ఏర్పాటు చేయాలని జవహర్ రెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ అధికారులు వాహనసేవలకు వినియోగించే వివిధ వాహనాల పటిష్టతను పరిశీలించి లోటుపాట్లను సరి చేయాలని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
Also Read: TTD High Court : 50 మంది టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులకు షాక్ .. జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు
Also Read: Tirumala Temple: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచిన టీటీడీ