Andhra Pradesh Govt decided to distribute 3 free gas cylinders to beneficiaries starting from Diwali | దీపావళి పండుగ రోజు నుంచి ప్రతి మహిళకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏపీ మంత్రి వర్గం ఈ మేరకు నేడు నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు. దీపావళి కానుకగా అక్టోబర్) 31 నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్ల పథకం అమల్లోకి తెస్తున్నామని చెప్పారు.


మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా లక్షలాది గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చామన్నారు. కట్టెల పొయ్యితో వంటకు ఇబ్బంది పడే ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని ఆనాడు ఆ కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఈ నెల (అక్టోబర్) 31వ తేదీ నుంచి ఏడాదికి 3 గ్యాస్ సిలెండర్ల పథకం అమల్లోకి తెస్తున్నామని తెలిపారు. మహిళలు ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ను పూర్తి ఉచితంగా పొందవచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన 24 గంటల్లో సబ్సిడీ జమ చేస్తామని చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నా మహిళలకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతో ఏడాదికి రూ.2684 కోట్ల ఖర్చుతో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మహిళలకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం దీపావళి కానుకగా అందిస్తుందని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.






వారం రోజుల ముందే దీపావళి


రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ… దీపావళి పండుగ వారం రోజుల ముందే వచ్చిందా అనేలా మూడు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయడం ఎంతో శుభపరిణామం అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం (Deepam Scheme) కింద గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చారు. కట్టెల పొయ్యితో వంటకు ఇబ్బంది పడే ఆడబిడ్డల కోసం నాడు కార్యక్రమం చేపట్టాం. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం పై హామీ ఇచ్చాం. ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ (Free Gas Cylinder) ప్రారంభించి పేద ప్రజల ఇళ్లల్లో దీపావళికి వెలుగులు నింపబోతున్నాం అన్నారు. అక్టోబర్ 31 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. ప్రతి మహిళా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు. వంటింటిపై భారం తగ్గించడంలో ఇదోపెద్ద ముందడుగు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ను పూర్తి ఉచితంగా పొందవచ్చు’ అన్నారు.


రూ.2684 మేర లబ్ది చేకూరనుంది..


వంగలపూడి అనిత ఇంకా మాట్లాడుతూ.. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన లబ్దిదారులకు 24 గంటల వ్యవధిలో సబ్సిడీ మొత్తం జమచేస్తాం. నేడు గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92 గా ఉంది. ఏడాదికి మూడు ఉచితంగా అంటే రూ.2684 మేర లబ్ది జరుగుతుంది. దీని కోసం ఏడాదికి రూ.2684 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోంది. ఇలాంటి పథకాలు పేదల జీవన ప్రామాణాలు పెంచడంలో భాగం అవుతాయి. కేవలం పథకాలు ఇవ్వడమే కాదు.. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది. మహిళలకు సంబంధించి ఆస్తి హక్కు నుంచి విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల వరకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. నేడు మూడు పార్టీల కూటమి లో సైతం మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఆర్థిక సమస్యలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేశాం. మహిళా సంక్షేమం, గౌరవం, భద్రత, ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Also Read: Andhra News: జగన్ కి ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ - టీడీపీ సంచలన పోస్టులు వైరల్


సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా దీపావళి నుండి  3 సిలిండర్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఆరోజే  సిలిండర్లను డెలివరీ చేస్తాం. ఇందుకోసం 3 రోజుల ముందు నుండే  సిలిండర్ల  బుకింగ్ ప్రక్రియను ప్రారంబించేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. 3 బ్లాక్ పిరియడ్లలలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ఏప్రిల్ నుండి జూలై, ఆగస్టు నుండి నవంబరు, డిసెంబరు నుండి మార్చి మూడు బ్లాకుల్లో ఈ మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామన్నారు.  మూడు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. .
- ప్రతి గ్యాస్ సిలిండర్  ధర రూ.894.92 లని, ఈ మొత్తం సొమ్ము  రాయితీపై పూర్తిగా ఉచితంగా అర్హమైన కుటుంబాలకు అందిస్తాం. ఈ రాయితీ సొమ్మును  డిబిబి ద్వారా  లబ్దిదారుల ఖాతాలో  నేరుగా జమ చేస్తాం. డెలివరీ అయిన 48  గంటల్లోపే డి.బి.టి. ద్వారా లబ్దిదారుల ఖాతాకు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.