రెబల్ స్టార్ ప్రభాస్ 'సలార్ , కల్కి 2898 ఏడీ' సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇలా వరుసగా బ్లాక్ బస్టర్స్ తో ప్రభాస్ సూపర్ ఫామ్ లో ఉన్న టైంలో వచ్చిన ఆయన బర్త్ డే ను అభిమానులు నెవర్ బిఫోర్ అన్న రేంజ్ లో జరుపుకుంటున్నారు. ఈసారి ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన పలు అప్డేట్స్ ను రిలీజ్ చేయడంతో డార్లింగ్ ఫాన్స్ ఫుల్ హైలో ఉన్నారు. అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ జోష్ కి బ్రేకులు వేసింది.
డార్లింగ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. టాప్ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా కొనసాగుతున్న ప్రభాస్ అప్ కమింగ్ సినిమాల లైనప్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ఇక ఆయన ఖాతాలో ఉన్న బిగ్గెస్ట్ సినిమాలలో హను రాఘవపూడి మూవీ కూడా ఉంది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి స్పెషల్ అప్డేట్ వస్తుందని ఆశించిన అభిమానుల ఆశలపై నీళ్లు చల్లింది నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. 'డియర్ రెబల్ స్టార్ ఫ్యాన్స్.. మీరందరూ మన డార్లింగ్ ప్రభాస్ కొత్త అవతార్ ను ఈ ప్రత్యేకమైన రోజున ది రాజా సాబ్ లుక్ లో చూసారు. హను రాఘవపూడి, ప్రభాస్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ని మరో ప్రత్యేకమైన సందర్భంలో ఇస్తాము. జన్మదిన శుభాకాంక్షలు రెబల్ స్టార్' అంటూ ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీంతో ఈ మూవీ నుంచి అప్డేట్ వస్తుందని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఎదురయింది.
కాగా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే పట్టాలెక్కింది. 'సీతారామం' లాంటి ఫీల్ గుడ్ సినిమాను అందించిన హను.. ప్రభాస్ తో చేయబోతున్న సినిమా కూడా ఓ మంచి ప్రేమ కథతో రూపొందుతోందని టాక్ నడుస్తోంది. ఇక ఈ సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. డిసెంబర్ నుంచి ప్రభాస్ ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
ఇక ప్రభాస్ నటిస్తున్న సినిమాల నుంచి ఇప్పటికే బర్త్ డే కానుకగా అప్డేట్స్ వచ్చేసాయి. 'ది రాజా సాబ్' సినిమా నుంచి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అయితే దీనికి మిక్స్డ్ రెస్పాన్స్ దక్కింది. తాజాగా 'స్పిరిట్' మూవీ నుంచి సందీప్ రెడ్డి వంగా స్పెషల్ పోస్టర్ ద్వారా ప్రభాస్ కు విషెస్ తెలియజేశారు.