Chandrababu Visit Indrakeeladri Durgamma Temple: తెలుగు ప్రజలకు మరోసారి సేవ చేసే, రాష్ట్రానికి పూర్వ వైభవం తెచ్చే శక్తిని ప్రసాదించాలని కనకదుర్గమ్మను వేడుకున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) తెలిపారు. శనివారం ఆయన సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను (Indrakeeladri Durgamma Temple) దర్శించుకున్నారు. తొలుత వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండితుల వేద ఆశీర్వచనం అనంతరం, అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందించారు. బెజవాడ దుర్గమ్మ శక్తి స్వరూపిణి అని, సమాజాన్ని రక్షించి దుష్టుల్ని శిక్షించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. మానవ సంకల్పానికి దైవ సహాయం ఎంతో అవసరమనే రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నట్లు తెలిపారు. విజయవాడకు వచ్చిన చంద్రబాబుకు ఎంపీ కేశినేని నాని, టీడీపీ నేతలు కేశినేని చిన్ని, జనసేన నేత పోతిన మహేష్, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, అశోక్ బాబు, దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, మాగంటి బాబు, బుద్ధా వెంకన్న, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు.
విద్యార్థులతో ముచ్చట
ఈ సందర్భంగా గుంటూరు ఉమెన్స్ కాలేజీకి చెందిన విద్యార్థినులను చంద్రబాబు పలకరించారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఉండవల్లిలోని నివాసానికి వెళ్తుండగా, కొండవీటి వాగు లిఫ్ట్ వద్ద విద్యార్థినులు కనిపించారు. దీంతో కారు ఆపి వారితో ముచ్చటించారు. తాము బీఈడీ విద్యార్థులమని, స్టడీ టూర్ కోసం గుంటూరు నుంచి వచ్చామని విద్యార్థినులు తెలిపారు.
ఆసక్తికర ఘటన
కాగా, విజయవాడ ఎయిర్ పోర్టులో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడకు ఇండిగో విమానంలో చేరుకున్నారు. అయితే, ఇదే విమానంలో మంత్రి రోజా కూడా వచ్చారు. అయితే, చంద్రబాబు రాకతో విమానాశ్రయానికి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా చేరుకున్నారు. దీంతో సందడి నెలకొంది. ఈ క్రమంలో ప్రత్యేక సెరెమోనియల్ లాంజ్ ద్వారా మంత్రి రోజాను పోలీసులు బయటకు పంపారు. గతంలో విశాఖ ఎయిర్ పోర్టులో జనసైనికులు ఉన్న సమయంలో మంత్రి రోజాను పంపడంతో ఉద్రిక్తత తలెత్తింది. మళ్లీ అలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక లాంజ్ ద్వారా మంత్రిని పంపించినట్లు పోలీసులు తెలిపారు.
10 నుంచి పర్యటనలు
దేవాలయాల సందర్శన అనంతరం చంద్రబాబు పూర్తి స్థాయి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా ఈ నెల 10 నుంచి ఆయన జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను జగన్ (CM Jagan) ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, సర్పంచ్ లను ఉత్సవ విగ్రహాలుగా మార్చేసిందని టీడీపీ (TDP) ఆరోపిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 4 ప్రాంతాల్లో ఏపీ పంచాయతీ రాజ్ చాంబర్, ఏపీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడప జిల్లాల్లో జరిగే సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశాలకు పార్టీలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఆహ్వానించనున్నారు. ఒక్కో సమావేశానికి సుమారు 5 నుంచి 6 వేల మంది వరకూ హాజరవుతారని అంచనా వేస్తున్నారు.
Also Read: Nagarjuna Sagar Dispute: తెలంగాణ అభ్యర్థన - సాగర్ వివాదంపై ఈ నెల 6న మరోసారి కీలక సమావేశం