Ayodhya's Ram Temple Consecration:



ఇన్విటేషన్‌ కార్డులు..


వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి (Ayodhya Ram Mandir Consecration) ముహూర్తం ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటి నుంచే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ ట్రస్ట్ సభ్యులు ఆహ్వానం అందించారు. మోదీతో పాటు మరో 6 వేల మంది అతిథులకు ఆహ్వానం అందింది. వీళ్లలో పూజారులు, దాతలతో పాటు రాజకీయ నాయకులూ ఉన్నారు. ఇన్విటేషన్‌ కార్డులు (Ayodhya Ram Temple Pran Pratistha) ప్రింట్ చేసి అందరికీ అందించారు. 2020 ఆగస్టులో ఈ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ప్రధాని. మూడేళ్లుగా ఎప్పుడెప్పుడు ఇది పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నారు భక్తులు. పూజారులు, సాధువులు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ ఆలయాన్ని ప్రారంభించే వారం రోజుల ముందు నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో అఖండ రామాయణం, హనుమాన్ చాలీసా పఠించేందుకు సిద్ధమవుతోంది యూపీ ప్రభుత్వం. జనవరి 14-22 వరకూ ఈ క్రతువు కొనసాగనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది. జనవరి 22వ తేదీన రాముడి విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. 




మూడేళ్లుగా నిర్మాణం..


2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా కేంద్ర ప్రభుత్వం Shri Ram Janma Bhoomi Tirtha Kshetra' Trust ని ఏర్పాటు చేసింది. రామ మందిర నిర్మాణానికి సంబంధించిన పూర్తి బాధ్యతలు ఈ ట్రస్ట్‌కి అప్పగించింది. 2020 ఆగస్టు 5వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 1988లో అహ్మదాబాద్‌కి చెందిన సోమ్‌పుర కుటుంబం రామమందిర నిర్మాణ డిజైన్‌ని తయారు చేసింది. దానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి 2020లో ఈ డిజైన్‌ని ఫైనల్ చేశారు. ఈ నిర్మాణానికి తమ వంతు సాయంగా థాయ్‌లాండ్‌ ప్రభుత్వం మట్టిని పంపింది. మట్టితో పాటు థాయ్‌లాండ్‌లోని రెండు నదుల నీళ్లనూ పంపింది. 


మోదీకి ఆహ్వానం 


రామ మందిరం ప్రారంభోత్సవం ఆహ్వానం అందడంపై ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ రోజు భావోద్వేగాలతో నిండిన రోజని అన్నారు. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు తనను కలవడానికి ఇంటికి వచ్చారని, శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్ననట్లు చెప్పారు. తన జీవితకాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం తన అదృష్టమని మోదీ ట్వీట్‌ చేశారు. 


Also Read: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కీలక బిల్స్‌,లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్రం మాస్టర్ ప్లాన్