Central Water Commission Meeting on Water Disputes in Telugu States: నాగార్జున సాగర్ నీటి విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కీలక సమావేశం ముగిసింది. ఆదివారం ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ నెల 6న మళ్లీ సమావేశం కానున్నారు. ఢిల్లీలోని కేంద్ర జల శక్తి శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు (సీఎస్ లు), సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు ఛైర్మన్లు నేరుగా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టులపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం పరిష్కరానికి చర్చించారు. తమ నీటి అవసరాలు, ప్రాజెక్టుల పరిస్థితిని ఏపీ అధికారులు వివరించారు. ఏపీ పంపిన ఇండెంట్ పై ఈ నెల 4న నిర్ణయం తీసుకోవాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డును కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. అప్పటివరకూ సాగర్ నుంచి నీటి విడుదల నిలిపేయాలని ఏపీ ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఇప్పటివరకూ దాదాపు 5 వేల క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు తెలుస్తోంది.


కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల బాధ్యత


కాగా, నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాలు వాటికి అనుబంధంగా ఉన్న ఉమ్మడి నిర్మాణాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించే ప్రక్రియను కేంద్ర జల శక్తి శాఖ ప్రారంభించనుంది. గత మూడు రోజులుగా నాగార్జున సాగర్ వద్ద చోటు చేసుకున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. కేఆర్‌ఎంబీ పర్యవేక్షణలో ప్రాజెక్టులను సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌ భద్రత పరిధిలోకి రెండు జలాశయాలను తీసుకు రావాలని యోచిస్తోంది. జలాశయాల నిర్వహణ మొత్తం కేఆర్ఎంబీకే అప్పగించాలని కేంద్రం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాలపైనే సమావేశంలో చర్చించినట్లు సమాచారం.


డ్యాం వద్ద కేంద్ర బలగాలు


మరోవైపు, నాగార్జున సాగర్ పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు, కేంద్ర బలగాలకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకారం తెలిపిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాం వద్ద మోహరించాయి. వీరి రాకతో తెలంగాణ పోలీసులు డ్యాం నుంచి వెనుదిరిగారు. అటు, సాగర్ కుడి కాలువ ద్వారా ప్రస్తుతం 5,450 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.


నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వ లేఖ


నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీటి విడుదల ఆపాలంటూ కేఆర్ఎంబీ రాసిన లేఖపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. నీటి విడుదల ఆపేది లేదంటూ ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మరో లేఖ రాశారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఏపీకి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కారును నియంత్రించడంలో మీ వైఫల్యం వల్లే మా భూభాగంలోని నాగార్జున సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ను గురువారం స్వాధీనం చేసుకున్నామని కృష్ణా బోర్డుకు తేల్చిచెప్పారు. 'మా రాష్ట్రానికి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసమే సాగర్ కుడి కాలువకు విడుదల చేశాం. ఉమ్మడి ప్రాజెక్టుల్లో మా నీటిని తెలంగాణ వాడుకుంటోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోలేదు. అందుకే మేం సాగర్ లో సగం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాం. సమస్యను పరిష్కరించే వరకూ నీటి విడుదలను ఆపే ప్రసక్తే లేదు.' అని స్పష్టం చేశారు.


పోటా పోటీ కేసులు


అటు, ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల పోలీసులు పోటా పోటీగా కేసులు నమోదు చేసుకున్నారు. ఏపీ పోలీసులు తమపై దాడి చేసి సాగర్ డ్యాంపైకి అక్రమంగా చొరబడ్డారని తెలంగాణ భద్రతా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే, అనుమతి లేకుండా సాగర్ నీటిని విడుదల చేశారని, ఏపీ ఇరిగేషన్ అధికారులపైనా తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ 2 కంప్లైంట్స్ పై నాగార్జున సాగర్ పీఎస్ లో కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులపై ఏపీ ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ మేరకు విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్ లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.


Also Read: AP Letter to KRMB: 'నీటి విడుదలను ఆపేది లేదు' - కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం స్పష్టత, కేంద్రం ఆధీనంలోకి సాగర్ ప్రాజెక్టు