AP Letter to KRMB on Sagar Water Issue: నాగార్జున సాగర్ కుడి కాలువ (Nagarjuna Sagar) నుంచి నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) కేఆర్ఎంబీ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి (AP Water Resources Principal Secratary) శశి భూషణ్ కుమార్ కు లేఖ రాయగా, దీనిపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ మేరకు కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్ నందన్ కుమార్ కు శుక్రవారం రాత్రి లేఖ రాశారు. ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఏపీకి కేటాయించిన నీటిని వాడుకునే అవకాశం కల్పించేలా తెలంగాణ సర్కారును నియంత్రించడంలో మీ వైఫల్యం వల్లే మా భూభాగంలోని నాగార్జున సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ను గురువారం స్వాధీనం చేసుకున్నామని కృష్ణా బోర్డుకు తేల్చిచెప్పారు. 'మా రాష్ట్రానికి కేటాయించిన నీటిని తాగునీటి అవసరాల కోసమే సాగర్ కుడి కాలువకు విడుదల చేశాం. ఉమ్మడి ప్రాజెక్టుల్లో మా నీటిని తెలంగాణ వాడుకుంటోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోలేదు. అందుకే మేం సాగర్ లో సగం ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాం. సమస్యను పరిష్కరించే వరకూ నీటి విడుదలను ఆపే ప్రసక్తే లేదు.' అని స్పష్టం చేశారు.


లేఖలో ఏం చెప్పారంటే.?



  • శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కర్నూలు ప్రాజెక్ట్స్‌ సీఈకి, సాగర్‌ నిర్వహణ బాధ్యత ఆ ప్రాజెక్టు సీఈకి అప్పగించారు. 2014 నుంచే తెలంగాణ భూభాగంలోని శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. అదే సమయంలో మా భూభాగంలోని సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను సైతం తమ అదీనంలోకి తీసుకుంది.

  • గత తొమ్మిదేళ్లుగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ సాగర్‌కు తరలించి.. అటు సాగర్‌ ఎడమ కాలువలో తమ పరిధిలోని ఆయకట్టుకు నీళ్లందిస్తూ రాష్ట్ర హక్కులను తెలంగాణ హరిస్తోందని చాలాసార్లు బోర్డుకు ఫిర్యాదు చేశాం. ఈ క్రమంలోనే ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను స్వాదీనం చేసుకోవాలని బోర్డును కోరాం. లేదంటే ఏపీ భూభాగంలోని సాగర్‌ కుడి కాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ను ఏపీకి  అప్పగించాలని కోరాం. కానీ, వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.  

  • శ్రీశైలం నుంచి 30, సాగర్ నుంచి 15 టీఎంసీల నీటిని ఏపీకి కేటాయిస్తూ అక్టోబర్ 9న కృష్ణా బోర్డు ఉత్తర్వులిచ్చింది. తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయించింది. అయితే, ఈ ఉత్తర్వులను తెలంగాణ ఉల్లంఘించి విద్యుదుత్పత్తి చేసింది. దీనిపై ఫిర్యాదు చేసినా మీరు పట్టించుకోలేదు. ఈ క్రమంలో మాకు రావాల్సిన 30 టీఎంసీల్లో 13 టీఎంసీలనే వాడుకున్నాం. మిగితా 17 టీఎంసీలు కోల్పోవాల్సి వచ్చింది.

  • సాగర్ నుంచి మాకు 15 టీఎంసీలు కేటాయించగా, ఇప్పటివరకూ 5 టీఎంసీలు వాడుకున్నాం. మిగిలిన 10 టీఎంసీలను వాడుకోనివ్వకుండా, తెలంగాణ ప్రభుత్వం సాగర్ ను ఖాళీ చేస్తే మా పరిస్థితేంటి.?. అని రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి ప్రశ్నించారు. ఇలాగే ఉంటే గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి ఎద్దడి తీర్చడం సవాల్ గా మారుతుందని చెప్పారు. ఆ ఆందోళనతోనే సాగర్ స్పిల్ వే స్వాధీనం చేసుకుని, కుడి కాలువకు నీటిని విడుదల చేస్తూ, మా హక్కును పరిరక్షించుకుంటున్నామని లేఖలో స్పష్టం చేశారు. నీటి విడుదలను ఆపే ప్రశ్నే లేదంటూ తేల్చిచెప్పారు.


కేంద్రం ఆధీనంలోకి సాగర్ ప్రాజెక్టు


మరోవైపు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా బోర్డుకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు డ్యాం వద్ద భారీగా మోహరించాయి. కేంద్ర బలగాల రాకతో తెలంగాణ పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. అటు, సాగర్ కుడి కాలువ ద్వారా ప్రస్తుతం 4 వేల క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది.


నేడు సమావేశం


అటు, కృష్ణా జలాల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. నేడు ఇరు రాష్ట్రాల అధికారులతో సమావేశం కానుంది. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యాం రిజర్వాయర్ల బాధ్యతలు, వాటి పరిధిలోని ఇతర నిర్మాణాలన్నింటినీ కృష్ణా బోర్డుకు బదిలీ చేసే అంశాలపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది.


Also Read: Magic figure tention: మ్యాజిగ్ ఫిగర్‌ దాటకపోతే ఏం చేయాలి-మంతనాల్లో మునిగిపోయిన పార్టీలు