Magic figure tention in Parties: రేపు (ఆదివారం) తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో రేపు తేలిపోతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత... ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు. అవన్నీ కాంగ్రెస్ వైపు మొగ్గుచూపాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం తెలంగాణలో హంగ్ తప్పదని చూపించాయి. ఆ ఎగ్జిట్ పోల్స్‌లో ఏపార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ ఇవ్వలేదు. దీంతో ప్రధాన పార్టీల్లో మ్యాజిక్ ఫిగర్ టెన్షన్ పట్టుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి... 70కిపైగా స్థానాల్లో గెలిచి అధికారం చేపడతామని చెప్తున్న ఆ పార్టీకి... లోలోపల మ్యాజిక్ ఫిగర్ భయం వెంటాడుతున్నట్టు సమాచారం. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే ఏం చేయాలి..? అనే దానిపై కాంగ్రెస్ పార్టీ నేతలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
కౌంటింగ్‌కు ఇంకొక్క రోజే సమయం ఉంది. రేపు (ఆదివారం)... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో క్లారిటీ రానుంది. అటు బీఆర్‌ఎస్...ఇటు కాంగ్రెస్ అధికారం తమదంటే తమదే అని చెప్తున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌దే అధికారం అని చెప్తున్నా... బీఆర్‌ఎస్ మాత్రం కొట్టిపారేస్తోంది. ఎగ్జిట్‌పోల్స్ అన్నీ బోగస్ అని... అధికారం చేపట్టేది తామే అని చెప్తోంది. సీఎం కేసీఆర్ డిసెంబర్ 4వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారంటే వారి ధీమా ఏంటో అర్థమవుతోంది. మరోవైపు, కాంగ్రెస్... ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకే పట్టం కట్టాయి. దీంతో అధికారం తమదే అంటోంది. అయితే.. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల నాడి ఎవరికీ పూర్తిగా అర్థం కాలేదన్నది కొందరు విశ్లేషకుల మాట. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా... రేపు అసలైన ఫలితాలు వస్తే గానీ తెలంగాణలో వేవ్ ఎవరిది అన్నది తేల్చేది కష్టమని అంటున్నారు.
ఇవన్నీ పక్కనపెడితే... తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ అయితే కనిపించింది. ఈ రెండు పార్టీల్లో పూర్తి మెజారిటీ ఎవరిది అన్నది రేపు తేలిపోతుంది. ఒకవేళ ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే.. అప్పుడు ఏం చేయాలి..? ఇదే అంశంపై తర్జనభర్జన పడుతున్నాయి పార్టీలు. ముఖ్యంగా గాంధీభవన్‌లో ఈ అంశంపైనే ప్రధానంగా చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
రేపు వెలువడే ఫలితాల్లో... అధికారం చేపట్టేందుకు అవసరమైన మెజారిటీ వస్తే సరే... ఏ సమస్యా లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక వేళ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే... గెలిచిన స్థానాల సంఖ్య మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే... అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలని..? అని వ్యూహరచన చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అలాంటి పరిస్థితి వస్తే... ఏం చేయాలనేదానిపై టీపీసీసీ నాయకత్వం ఎప్పటికప్పుడు ఏఐసీసీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉంటూ చర్చిస్తున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని వారికి వివరిస్తూ... ఎలాంటి పరిస్థితి ఎదురైతే... ఎలా వ్యవహరించాలన్న దానిపై హైకమాండ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు.
రేపటి ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు పూర్తిస్థాయి మెజారిటీ రాకపోతే... గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే ఆ పార్టీ ముందున్న అతిపెద్ద టార్గెట్. అలాంటి పరిస్థితే వస్తే... గెలిచిన ఎమ్మెల్యేలను వెంటనే కర్ణాటకకు తరలించి క్యాంపు పెట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న కూడా తెలుస్తోంది. ఈ బాధ్యతను కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఇచ్చిందట కాంగ్రెస్ హైకమాండ్. ఆయన హైదరాబాద్‌లో ఉండి.. పరిస్థితి చక్కబెట్టపోతున్నారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే... గెలిచిన ఎమ్మెల్యులను కాపాడుకుంటూ... తక్కువపడిన స్థానాల కోసం ఎంఐఎంతో సంప్రదింపులు జరిపి.. వారి మద్దతు తీసుకోవాలని కూడా యోచిస్తోందట కాంగ్రెస్ అధిష్టానం.
ఇక.. బీఆర్‌ఎస్‌లో మ్యాజిక్ ఫిగర్‌పై చర్చ జరుగుతోందని అంటున్నారు కొందరు విశ్లేషకులు. పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వస్తే సరేసరి.. ఒకవేళ మ్యాజిగ్ ఫిగర్‌కు దగ్గరగా వచ్చి ఆగిపోతే.. అప్పుడు ఏం చేయాలని అన్నదానిపై గులాబీ దళం వ్యూహరచన చేస్తోందని సమాచారం. ఎంఐఎం మద్దతు తీసుకోవడంతోపాటు... పక్క పార్టీల నుంచి తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యేలను, కొందరు ఇండిపెండెంట్లను కలుపుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా.. ఈసారి తెలంగాణ ఎన్నికల ఫలితాలు ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.