KCR Confidant On Results: కచ్చితంగా మూడోసారి అధికారంలోకి వస్తున్నామని చెబుతున్నారు సీఎం కేసీఆర్‌. ప్రగతి భవన్‌లో పలువురు పార్టీ నేతలతో సమావేశమైన కేసీఆర్‌ విజయంపై అదే ధీమాతో ఉన్నారు. వివిధ జిల్లా నాయకులతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. ప్రజలు బీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని ఫలితాల రోజు అందరికీ విషయం అర్థమవుతుందని అభిప్రాయపడ్డారు. 


పోలింగ్‌ సరళి, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలపై బీఆర్‌ఎస్‌ లీడర్లు సీఎం కేసీఆర్‌తో మంతనాలు జరిపారు. మంత్రి హరీష్‌రావు సహా చాలా మంది రాష్ట్ర స్థాయి లీడర్లు ఆయనతో సమావేశమయ్యారు. పోలింగ్‌ జరిగిన తీరు పథకాల లబ్ధిదారుల వైఖరి, ప్రజల మూడ్‌పై చర్చించారు. అనుకూల ప్రతికూల అంశాలపై మాట్లాడుకున్నారు. 


జిల్లా నాయకులకి కూడా సీఎం కేసీఆర్‌ ఫోన్లు చేసినట్టు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతం, ప్రజల మధ్య చర్చకు వస్తున్న అంశాలు అన్నింటిపై ఆరా తీశారు. అందరితో మాట్లాడిన సీఎం కేసీఆర్‌ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంతో హైరానా పడొద్దని సూచించారు. ఆఖరి నిమిషంలో పోలింగ్ శాతం భారీగా పెరిగిందని అందతా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంటుందని అనే విశ్లేషణ చేశారు. ఎవరూ టెన్షన్‌ పడకుండా ప్రశాంతంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. ఫలితాలు వచ్చే వరకు ఎలాంటి డిస్కషన్స్ పెట్టుకోవద్దని చెప్పారు. మూడో తేదీని ఫలితాలు వచ్చిన తర్వాత అందరం కలిసి సంబరాలు చేసుకుందామని భరోసా ఇచ్చారు. 


ఎగ్జిట్‌ పోల్స్‌కు భిన్నంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉంటాయని అన్నారు కేసీఆర్. తనను కలిసేందుకు వచ్చిన వారికి విక్టరీ సింబల్‌ చూపించి విజయం సాధిస్తున్నామని భరోసా ఇచ్చారు. అదే టైంలో సాగర్‌ వివాదంపై కూడా ఆరా తీశారు. ఏపీ దూకుడు ప్రదర్శించిన విషయాన్ని అధికారులు ఆయనకు వివరించారు. తెలంగాణ విషయంలో రాజీ వద్దని అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.