Revanth Reddy Comments: తెలంగాణలో కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ముందస్తుగానే రైతు బంధు నిధులను ఇతర మార్గాల ద్వారా మళ్లిస్తున్నారని ఆరోపించారు. కమీషన్ల కోసం రైతు బంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో తాము శనివారం ఎన్నికల కమిషనర్ ను కలుస్తామని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ భూములను ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతుందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్ లో మార్పులు జరుగుతున్నాయని రేవంత్ ఆరోపించారు.
ఆపద్ధర్మ ప్రభుత్వం అధికార దుర్వినియోగం - భట్టి
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు తెలంగాణ ప్రజలకు భట్టి విక్రమార్క ధన్యవాదాలు తెలిపారు. తమ పార్టీపై ఉన్న అభిమానంతో ప్రజలు తమ పక్షాన నిలిచారని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. చాలా సర్వే సంస్థలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రకటించాయని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆపద్ధర్మ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ధరణిలో తప్పుడుగా నమోదు చేస్తోందని అన్నారు. ఆ తర్వాత వేరే వ్యక్తుల పేర్ల మీదకు మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు.
రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ జరిగే సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలని భట్టి కోరారు. గత ఎన్నికల కౌంటింగ్ సమయంలో కూడా ధర్మపురి, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, హుజూర్‌నగర్ లో ఇబ్బందులు నెలకొన్నాయని అన్నారు. ప్రస్తుతం కోర్టులల్లో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయని గుర్తు చేశారు. కాబట్టి, కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సొమ్ము ప్రగతి భవన్ కు - మధుయాస్కి
ఎగ్జిట్ పోల్ ఫలితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ ను ఖాళీ చేసే పనిలో ఉన్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కి గౌడ్ ఆరోపించారు. ప్రగతి భవన్ లో ఉన్న సొమ్ము మొత్తం ఫాం హౌజ్ కి తరలించుకుపోతున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతేకాక, ఓడిపోతామనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో ఉన్న భూములను రాత్రికి రాత్రే పేర్లు మారుస్తున్నారని ఆరోపించారు. మధుయాష్కీగౌడ్ శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయేది తెలంగాణ ప్రజల విజయం అని.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.