Pawan Kalyan Comments With Party Leaders: ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాడటమే తప్ప తాను ఏనాడూ జాతీయ స్థాయి నాయకుల వద్దకు వెళ్లి సహాయం కోసం చేయిచాచి అడగలేదని జనసేనాని పవన్ కల్యాణ్ (Pawankalyan) అన్నారు. మంగళిగిరిలోని (Mangalagiri) పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జనసేన విస్తృత స్థాయి సమావేశంలో (Janasena Party Meeting) పవన్ పాల్గొని ప్రసంగించారు. 'ఇది మన నేల. మన పోరాటం. మన పార్టీకి యువత బలం చూసి బీజేపీ పెద్దలే ఆశ్చర్యపోయారు. కార్యకర్తల చిత్తశుద్ధి వల్లే జనసేనకు ఢిల్లీలోనూ గుర్తింపు వచ్చింది. నన్ను నా భావజాలాన్ని నమ్మే యువత మన వెంట వస్తున్నారు. ఇంత మంది అభిమానుల బలం ఉందని మనకు గర్వం రాకూడదు.' అని పవన్ చెప్పారు.



యువత మద్దతే అండ


ఏపీలో జనసేనకు ఇవాళ ఆరున్నర లక్షల కేడర్ ఉందని, యువతే పెద్ద బలమని పవన్ పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల యువత కూడా తమకు మద్దతిస్తున్నారని, ఆ ఆదరణ చూసే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల పోటీ చేసినట్లు వివరించారు. ఖమ్మం, మధిర, కూకట్పల్లి, దుబ్బాక ఇలా ఎక్కడికి వెళ్లినా యువత పెద్ద ఎత్తున తరలివచ్చారని అన్నారు. జనసైనికులంతా స్వార్థం వదిలి పని చేయాలని పిలుపునిచ్చారు. 


వైసీపీపై విమర్శలు


వైసీపీకి భావజాలం లేదని పవన్ విమర్శించారు. 'వారు ఎందుకోసం పని చేస్తున్నారో వారికే తెలియదు. అన్న సీఎం కావాలి. అందుకోసం పని చేస్తున్నాం అని చెబుతారు. నేను ఏం చేసినా దేశ సమగ్రత కోసమే ఆలోచిస్తా. సమాజాన్ని ఎలా చూస్తాం అనే దానిపై జనసేనకు స్పష్టమైన అవగాహన ఉంది. నా సినిమాలు ఆపేసినా, నేను బస చేసిన హోటల్ వద్దకు వచ్చి బెదిరించి ఇబ్బంది పెట్టినా నేను ఏనాడూ జాతీయ నేతల వద్దకు వెళ్లి వారి సహాయం అడగలేదు.' అని పవన్ స్పష్టం చేశారు. 'మన బలం చూపించకపోతే గుర్తింపు ఇవ్వరు. స్వార్థం వదిలేయాలని నాయకులను కోరుతున్నా. చేసే పని, పోరాటమే మనకు గుర్తింపు ఇస్తుంది.' అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.


'కులాల ఉచ్చులో చిక్కుకోవద్దు'


వైసీపీ నేతలు వేసే కులాల ఉచ్చులో చిక్కుకోవద్దని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ సూచించారు. ఏపీ సుస్థిరత, సమైక్యత, అభివృద్ధి కోసమే టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని, పొత్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారంతా వైసీపీ కోవర్టులేనని అన్నారు. తెలంగాణలో బీజేపీతో, ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామంటే అది ప్రజల మంచి కోసమేనని స్ఫష్టం చేశారు. దీనిపై విమర్శించే స్థాయి వైసీపీ నేతలకు లేదన్నారు. వైసీపీని సమర్థంగా ఎదుర్కోవడానికే రాష్ట్రంలో టీడీపీ, జనసేనలు కలిశాయని పునరుద్ఘాటించారు. 'నేను మొదటి నుంచి పదవులు కోరుకోలేదు. నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రజలకు సేవ చేయాలనుకున్నా. వైసీపీ నేతలు మెగాస్టార్, పవర్ స్టార్ ను కూడా బెదిరిస్తారు. దెబ్బపడినా ఎప్పటికీ మరిచిపోను. ఓడిపోయినప్పుడు మనకు అండగా ఎవరుంటారు అనేదే ముఖ్యం. పార్టీ నుంచి వెళ్లిపోతామని అనేక మంది బెదిరించారు. ఇష్టం లేకుంటే వెళ్లిపోవాలని వారికి చెప్పా. మేము టీడీపీ వెనుక నడవడం లేదు. ఆ పార్టీతో కలిసి నడుస్తున్నాం.' అని పవన్ పేర్కొన్నారు.


తెలంగాణ ఓటింగ్ పై


తెలంగాణ ఎన్నికల ఓటింగ్ శాతం చూసి బాధ కలిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. అక్కడ పోలింగ్ 50 శాతం కూడా ఉండకపోవడం మంచి విషయం కాదన్నారు. యువత ఓటింగ్ కు పూర్తిగా దూరమయ్యారని, ఆ పరిస్థితి మారాలని చెప్పారు. ప్రజలకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పవన్ స్పష్టం చేశారు. 


Also Read: Andhra News: నడి సంద్రంలో దగ్ధమైన బోటు - కోస్ట్ గార్డ్ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్, 11 మంది మత్స్యకారులు సేఫ్