Boat Caught Fire in Middle of the Sea in Kakinada Coastal Area: కాకినాడ (Kakinada Coastal Area) తీరంలో వేటకు వెళ్తున్న బోటులో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. బోటు నడి సంద్రంలో ఉండగా, అందులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో బోటులోని 11 మంది మత్స్యకారులు మంటల్ని అదుపు చేసేందుకు యత్నించారు. అది సాధ్యం కాకపోవడంతో తీరంలో గస్తీ కాస్తున్న కోస్ట్ గార్డు (Coast Guard) సిబ్బందికి సమాచారం అందించారు. ఈ క్రమంలో ప్రాణభయంతో సముద్రంలోకి దూకేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న గస్తీ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వారందరినీ రక్షించారు. దీంతో వారు కోస్ట్ గార్డు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. 



ఇదీ జరిగింది


కాకినాడ – భైరవ పాలెంకు మధ్యలో తీరానికి 20 కిలోమీటర్ల దూరంలో చేపల వేట కోసం తెల్లవారుజామున కాకినాడకు చెందిన మత్స్యకారుడు జానకిరామ్ కు చెందిన బోటులో 11 మంది మత్స్యకారులు బయలుదేరారు. వీరు నడి సంద్రంలోకి వెళ్లే సరికి బోటులో మంటలు చెలరేగాయి. ఇంజిన్ వద్ద డీజిల్ ట్యాంకులో ఒక్కసారిగా మంటలు రావడంతో మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో సమీపంలో గస్తీ విధులు నిర్వహిస్తోన్న కోస్ట్ గార్డు సిబ్బందికి సమాచారం అందించడంతో వారు వెంటనే స్పందించారు. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని, నీళ్లల్లో దూకిన 11 మందిని లైఫ్ జాకెట్ల్ సాయంతో రక్షించారు. దీంతో వారు కోస్ట్ గార్డు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మంటలు అంటుకున్న బోటు పూర్తిగా దగ్ధమైన అనంతరం నీట మునిగింది. దీని విలువ దాదాపు రూ.40 లక్షలు ఉంటుందని బాధిత మత్స్యకారులు తెలిపారు. 


సిలిండర్ పేలడంతో


మత్స్యకారులు చేపల వేటకు వెళ్లే సమయంలో వారి భోజన అవసరాల కోసం నిత్యావసరాలు, గ్యాస్ సిలిండర్ తదితర వస్తువులు వెంట తీసుకెళ్తారు. వేటకు విరామం ఇచ్చే సమయంలో బోటులో వంట చేసుకుంటారు. ఎప్పటిలాగే అలా వెళ్లిన 11 మంది మత్స్యకారులు తిరిగి వస్తుండగా బోటులో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. ఈ క్రమంలో సకాలంలో కోస్ట్ గార్డ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది.


Also Read: KRMB Orders: 'సాగర్ నుంచి నీటి విడుదల ఆపండి' - ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ కీలక ఆదేశాలు