KRMB Key Orders to AP on Nagarjuna Sagar Water Issue: సాగర్ జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ (KRMB - Krishna River Management Board) కీలక ఆదేశాలు జారీ చేసింది. నాగార్జున సాగర్ కుడి కాలువ (Nagarjuna Sagar) నుంచి నీటి విడుదల ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) ఆదేశించింది. ఈ మేరకు ఏపీ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి కేఆర్ఎంబీ సభ్య కార్యదర్శి లేఖ రాశారు. ఏపీ అక్టోబర్ కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేశారు. నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం తమ దృష్టికి తెచ్చినట్లు కృష్ణా బోర్డు సభ్యులు తెలిపారు.


సాగర్ డ్యాం వద్ద భారీగా పోలీసులు


మరోవైపు, నాగార్జున సాగర్ డ్యాం (Nagarjuna Sagar Dam) వద్ద ఇరు రాష్ట్రాల పోలీసులు భారీగా మోహరించారు. మొత్తం 26 గేట్లలో 13వ నెంబర్ వద్ద ఏపీ పోలీసులు (AP Police) కంచె ఏర్పాటు చేశారు. కృష్ణా రివర్ బోర్డు (Krishna River Board) నిబంధనల ప్రకారం 13వ నెంబర్ గేటు వరకూ తమ పరిధిలో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. అందుకే కంచె ఏర్పాటు చేసినట్లు చెబుతుండగా, దీన్ని తొలగించేందుకు శుక్రవారం ఉదయం తెలంగాణ పోలీసులు యత్నించగా వీరిని ఏపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే సాగర్ కుడి కాలువ ద్వారా ఏపీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యులు తాజాగా నాగార్జున సాగర్ డ్యాం వద్దకు చేరుకుని పరిశీలించారు. సీఈ అజయ్ కుమార్, ఇరిగేషన్ అధికారులు ఏపీ, తెలంగాణ అధికారులతో చర్చించారు. కాగా, ఇప్పటికే సాగర్ డ్యాం నుంచి ఏపీకి సుమారు 4 వేల క్యూసెక్కుల నీరు విడుదలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 522 అడుగులకు చేరింది. అయితే, మరో 12 అడుగుల మేర నీటిని వదిలితే డెడ్ స్టోరేజీకి చేరుతుందని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో తెలంగాణ అధికారుల ఫిర్యాదుతో ఏపీ పోలీసులపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా డ్యాంపైకి వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారంటూ, తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులు, తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. దీంతో ఏ1గా పేర్కొంటూ ఏపీ పోలీసులు, అధికారులపై కేసు నమోదైంది. అటు, ఈ ఘటనపై కేంద్రం సైతం ఆరా తీసింది.


అసలు వివాదం ఏంటంటే.?


రాష్ట్ర విభజన సమయంలోనే కృష్ణా, గోదావరి నదీ బోర్డులు ఏర్పాటయ్యాయి. ఆ టైంలో శ్రీశైలం జలాశయాన్ని ఆంధ్రప్రదేశ్‌, నాగార్జునసాగర్‌ను తెలంగాణ నిర్వహించాలనే నిర్ణయించారు. అయితే, ఈ నిర్ణయం సరిగ్గా అమలు కాలేదు. శ్రీశైలం జలాశయంలో ఎడమ విద్యుత్తు కేంద్రం, తదితరాలను తెలంగాణ రాష్ట్రమే నిర్వహించుకుంటోంది. అటువైపు ఆంధ్రప్రదేశ్‌ అధికారులను రానివ్వడం లేదు. అదే సమయంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులో 26 గేట్లకు 13 గేట్లు ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉంటాయి. కుడి కాలువ నుంచి నీటిని ఏపీకి తెలంగాణ అధికారులే విడుదల చేస్తున్నారు. అయితే, గతంలో కృష్ణా బోర్డు ఆదేశించినా నీళ్లు విడుదల చేయలేదని ఏపీ అధికారులు ఆరోపిస్తున్నారు.  తాజాగా ఇలాంటి సమస్యలేవీ తలెత్తలేదు. ఈ నెలలో సాగర్‌ కుడికాలువ నుంచి నీళ్లు విడుదల చేయాలని తెలంగాణ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ఇండెంటు పంపిన దాఖలాలూ లేవు. సాగర్ నుంచి నీటి విడుదలకు ఈ 2 నెలల్లో ఎలాంటి ఇబ్బందీ రాలేదు. అయితే, గత కొంతకాలంగా ఉమ్మడి జలాశయాలను బోర్డుల పరిధిలోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో ఏపీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి ఏపీ పోలీసుల ఆధ్వర్యంలో అధికారులు అక్కడికి చేరుకుని తమ పరిధిలో ఉన్న 13 గేట్ల నుంచి కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదల పైనే తాజాగా కేఆర్ఎంబీ తాజాగా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.


Also Read: 'మా వాటాకు మించి ఒక్క నీటి బొట్టునూ వాడుకోం' - సాగర్ నీటి విషయంలో ఏపీ చర్యలు సరైనవేనన్న మంత్రి అంబటి