Telangana cabinet meeting On Monday : డిసెంబర్ 4 వ తేదీ మధ్యాహ్నం 2:00 గంటలకు.. డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనున్నది. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా తెలిపింది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ జరగనుంది. ఈ తరుణంలో తర్వాత రోజే కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఫలితాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని ఆ ధీమాతోనే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారని భావిస్తున్నారు.
ఆదివారం కౌంటింగ్ లో బీఆర్ఎస్‌కు మెజార్టీ దక్కకపోతే కేబినెట్ భేటీ కష్టమే !
ఆదివారం ఉదయం కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ దక్కకపోతే.. మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు. అప్పటికే ప్రభుత్వం ప్రజా విశ్వాసం కోల్పోయినందున కేసీఆర్ రాజీనామా చేయాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ రాకపోతే ఆదివారం సాయంత్రమే రాజీనామా చేయడం సంప్రదాయం. అందకే సోమవారం కేబినెట్ భేటీ జరగడం సాధ్యం కాదు. ఒక వేళ రాజీనామా చేయకపోయినా మంత్రి వర్గ సమావేశం నిర్వహించడం సాధ్యం కాదన్న వాదన ఉంది. అయితే కేసీఆర్ అసలు బీఆర్ఎస్ ఓడిపోతుందన్న అంచనాలు ఏమీ పెట్టుకోవడం లేదని.. పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకంలో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా తమ విజయం ఖాయమని బీఆర్ఎస్ ధీమా
అందుకే మంత్రి వర్గ సమావేశ తేదీని ప్రకటించారని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. గతంలో కూడా ఎగ్జిట్ పోల్స్ వ్యతిరేకంగా వచ్చాయని కానీ ఫలితాలు అనుకూలంగా వచ్చాయని గుర్తు చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ కన్నా ఎగ్జాక్ట్ పోల్స్ లో తమకు ఎక్కువ మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. కేసీఆర్ స్వయంగా పోలింగ్ సరళిని విశ్లేషించుకుని గెలుపుపై ధీమాతో ఉన్నారని చెబుతున్నారు. అందుకే.. తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు.. ప్రమాణ స్వీకార ముహుర్తంపై పండితులతో చర్చలు జరపడం వంటివి చేస్తున్నారని చెబుతున్నారు.
పార్టీ క్యాడర్ భరోసా ఇస్తున్న కేటీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఖచ్చితంగా మూడో సారి ప్రమాణస్వీకారం చేస్తారని బీఆర్ఎస్ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు. కేటీఆర్ కూడా అదే చెబుతున్నారు. పార్టీ శ్రేణులు ఎవరూ కంగారు పడొద్దని.. ఫలితాలు మనకే అనుకూలంగా వస్తాయని చెబుతూ వస్తున్నారు. కేసీఆర్ ప్రమాణస్వీకారం చేస్తారంటున్నారు. కేటీఆర్ వ్యక్తం చేస్తున్న ధీమాతో.. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భరోసాగా ఉన్నాయి. కేసీఆర్ మీడియాతో మాట్లాడకపోవడం ఓటమిని అంగీకరించినట్లుగానే ఉందని జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టేలా కేసీఆర్.. కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.